నల్లగొండ, అక్టోబర్ 1 : తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్లగొండ పట్టణాన్ని సుందరీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట నిలబెట్టుకొని ఏడాదిలోనే రూ.1305 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన మంత్రి కేటీఆర్ నేడు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ నల్లగొండకు ఐటీ హబ్, మెడికల్ కళాశాల, బత్తాయి మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొస్తానని హామీ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశమొచ్చినా వాటి గురించి పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాను ఒక్క టర్మ్‌లోనే వాటినన్నింటినీ తీసుకొచ్చి నిర్మాణం చేసినట్లు తెలిపారు. అమెరికా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో సాధ్యమయ్యే ఐటీ కొలువులు నేడు నల్లగొండకు వచ్చాయన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో నల్లగొండకు ఈ ఏడాదిన్నరలోనే రూ.1305 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
మరో ఏడాదిన్నర కాలంలో ఈ పనులన్నీ పూర్తవుతాయని, మరోసారి తనకు అవకాశమిచ్చి గెలిపించాలని కోరారు. నల్లగొండ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీతోపాటు మంచినీటి కోసం డబుల్ పైపులైన్ పనులు చేశామని, విలీన గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో ఐటీ హబ్ పూర్తయిందని, త్వరలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. 2040 నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. సోమవారం నల్లగొండ పట్టణంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఆ తర్వాత ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ ఉన్నందున ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఐటీ కొలువులు ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు యువత తరలి రావాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నల్లగొండ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.