Most Profitable Crops | దేవరకొండ, డిసెంబర్ 10 : దేవరకొండ మండలంలోని వైదొనివంపు గ్రామం కీర దోస సాగుకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. గ్రామంలో 10 మంది రైతులు సంప్రదాయ పంటలు కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే కీర సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. 90 రోజుల్లోనే పంట పూర్తిగా చేతికొస్తుండగా.. ఎకరానికి లక్ష వరకు ఆదాయం వస్తున్నదని రైతులు చెప్తున్నారు. రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ఆదాయం వచ్చే పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో దేవరకొండ మండలంలోని వైదోనివంపు గ్రామంలో10 మంది రైతులు కీర దోస పంటను సాగు చేస్తున్నారు.
అందుకు అయ్యే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, పందిరి ఏర్పాటు ఖర్చు, వైరు, దారం మొత్తం గ్లోబల్ గ్రీన్ కంపెనీ సరఫరా చేస్తున్నది. 30 రోజులకు కోత మొదలై 90 రోజుల్లో పంట పూర్తిగా చేతికి వస్తుంది. కోత ప్రారంభమైన నాటి నుంచి సుమారు 25 కోతలు వస్తాయని రైతులు తెలిపారు. ఎకరం సాగు చేస్తే రూ.50వేల వరకు ఖర్చు వస్తుందంటున్నారు. గతంలో నేలపైనే పంటను వేసి కోత కోసే వారమని, ఈ సారి దిగుబడి పెంచేందుకు కర్రలతో నిలువు పందిరి వేసినట్లు చెప్పారు. పంటను కోసిన అనంతరం గ్రేడింగ్ చేస్తే కంపెనీ వాళ్లు గ్రామానికి వచ్చి కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్ నాలుగు రకాలుగా ఉంటుంది. గ్రేడింగ్ వారీగా రైతులకు ధర చెల్లిస్తారు.
తెలంగాణలో పండించే కీర దోసను డ్రై ఫుడ్‌గా తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు వెయ్యి ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నట్లు రైతులకు అనుసంధానంగా ఉండే గ్లోబల్ గ్రీన్ కంపెనీ మేనేజర్ వెంకట్రావ్ తెలిపారు. నల్లగొండ జిల్లాలో దేవరకొండ, నాగార్జునసాగర్, డిండి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు ప్రాంతాల్లో కీర సాగు ఎక్కువగా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పండించిన కీర దోసను గ్రేడింగ్ చేసి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో ఉన్న గ్లోబల్ గ్రీన్ కంపెనీకి తీసుకెళ్తారు. అక్కడ డ్రై ఫుడ్‌గా తయారు చేసి అమెరికా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, కువైట్, సౌదీ అరేబియాతో పాటు మరో 15 దేశాలకు సరఫరా చేస్తున్నట్లు కంపెనీ మేనేజర్ తెలిపారు.
నేను నాలుగు సంవత్సరాల నుంచి కీర దోస సాగు చేస్తున్నా. 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరంలో సుమారు లక్షకు పైనే ఆదాయం వస్తున్నది. కీర సాగుకు పెట్టుబడి, విత్తనాలు, నిలువు పందిరికి అయ్యే ఖర్చు మొత్తం కంపెనీ యజమాని అందిస్తున్నారు. కోత కోసినప్పుడు కూలీల ఖర్చు రైతులు భరించాలి. కోత కోసిన పంటను నాలుగా రకాలుగా విభజించి ధర చెల్లిస్తారు. నేను పంట వేసి ఇప్పటికి 30 రోజులు అవుతుంది. మరో ఐదు రోజుల్లో కోతకు వస్తుంది. మేము పండించిన పంటను కంపెనీ తీసుకొని పెట్టుబడులు మినహాయించుకొని మిగిలిన డబ్బు మాకు చెల్ల్లిస్తారు.
– నల్లగాసు వీరయ్య, రైతు, వైదోనివంపు
రైతులు పండించే కీర దోసను నాలుగు రకాలుగా గ్రేడింగ్ చేసి ఒప్పందం ప్రకారం ధర చెల్లిస్తాం. మొదటి రకం 14.5 ఎం.ఎం. సైజు ఉంటే కిలోకు రూ.36 ఇస్తాం. 18.5 ఎం.ఎం. సైజు అయితే 22 రూపాయలు, 25 ఎం.ఎం. సైజు ఉంటే రూ.12 ఇస్తాం. 32 ఎం.ఎం. సైజు ఉంటే కిలోకు రూ.4 చెల్లిస్తాం. రైతులకు విత్తనాలు సరఫరా చేసినప్పుడే గ్రేడింగ్ ప్రకారం ధరలు చెల్లిస్తామని ఒప్పంద పత్రం తీసుకుంటాం. విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్, పందిరి, కర్రలు, వైరును కంపెనీ వాళ్లు సరఫరా చేస్తారు. రైతులు పండించిన గ్రామంలోనే గ్రేడింగ్ చేసి తూకం వేసి రైతులకు పట్టీ వేసి ఇస్తాం.
– వెంకట్రావ్, గ్లోబల్ గ్రీన్ కంపెనీ మేనేజర్
కీర సాగు చేసే రైతులకు కంపెనీ నుంచి సలహాలు, సూచనలు ఇస్తాం. పంటను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ఏ గ్రామంలోనైనా పది మంది రైతులు ఉంటేనే సాగుకు యోగ్యంగా ఉంటుంది. మూడు నెలల కాలంలో మంచిగా సాగు చేసుకుంటే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. రైతులకు ఇంత తక్కువ కాలంలో మంచి ఆదాయం వచ్చే పంట కీర. ఈ సాగు రైతులకు ఎంతో మేలు.
– నాగభూషణం, కంపెనీ సూపర్వైజర్