దామరచర్ల, డిసెంబర్ 3 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలతో సతమతమవుతున్నాయని బీఆర్ఎస్వీ గురుకుల బాట ఇన్చార్జి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను బీఆర్ఎస్వీ బృందం మంగళవారం సందర్శించింది. గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ అద్దె భవనంలో నిర్వహిస్తున్న దామరచర్ల గురుకుల బాలుర పాఠశాలకు ప్రహరీ లేదని, విద్యార్థులు పడుకోవడానికి వసతులు, మరుగుదొడ్లు సక్రమంగా లేవని, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్ఓ ప్లాంటు లేక విద్యార్థులు డ్రమ్ముల్లో నీళ్లు పోసి కంచాలతో తాగుతున్నారని, కూరగాయలు, భోజనం సరిగ్గా లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. నిర్వహణ లోపంతో 11నెలల్లో 48 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని తెలిపారు.
గత కేసీఆర్ పాలనలో 300 ఉన్న గురుకులాలను వెయ్యికి పెంచి అన్ని వసతులు, సదుపాయలు కల్పించి నాణ్యమైన భోజనం అందించారని చెప్పారు. ఇప్పటికైనా గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి.నారాయణరెడ్డి, ఆంగోతు హాతీరాంనాయక్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనూనాయక్, నాగార్జున, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి ధనావత్ ప్రకాశ్‌నాయక్, బీఆర్ఎస్వీ బృందం నాయకులు మితున్ ప్రసాద్, సాయిగౌడ్ పాల్గొన్నారు.