యాదాద్రి భువనగిరి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఓ వైపు వరుస భారీ వర్షాలతో వడ్లు తడిసి ముద్దవుతున్నా సర్కార్‌లో చలనం లేదు. రైత న్న ఏమైతే మా కేంటీ అన్న నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా కొనసాగుతోంది. పీపీసీ సెంటర్లు ప్రారంభించినా..అనేక చోట్ల ధాన్యం కాంట వేయడం లేదు. దీంతో చేసేదేమీ లేక అన్నదాతలు అరకొర ధరకు ప్రైవేట్‌లో అమ్ముకుంటూ భారీగా నష్టపోతున్నారు.
9.51శాతమే కొనుగోళ్లు..
వానకాలం సీజన్‌కు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.06 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1.86 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం, 20 వేల ఎకరాల్లో సన్నాలు వేశారు. ఈసారి 4.58 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల అవసరాలు పోను 2.80 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు, 20 వేల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనాలని నిర్ణయించారు. జిల్లాలో 323 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా..అన్నీ ప్రా రంభించారు. కానీ చాలా చోట్ల కాంటా మాత్రం వేయడంలేదు. ఇప్పటి వరకు 232 సెంటర్లలో కొనుగోళ్లు జరిగాయి. 3605 మంది రైతుల నుంచి 28,547 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. అంటే మొత్తం లక్ష్యంలో 9.51 శాతం మాత్రమే కాంటా వేశారు.
అటు ప్రైవేట్‌లో అమ్మకం.. ఇటు బీ గ్రేడ్‌కే విక్రయం..
కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు కేంద్రాల్లోనే నిరీక్షిసున్నారు. ఇటీవల భారీ వర్షాలతో పలుచోట్ల వడ్లు వరదపాలయ్యాయి. కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తింది. దీంతో వచ్చిన ధాన్యం వచ్చినట్లు అమ్ముకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్‌లో కేవలం క్వింటాల్‌కు రూ.1800 మాత్రమే పలుకుతున్నది. వరి క్వింటా ధాన్యం ఏ గ్రేడ్‌కు రూ.2389, సాధారణ రకం క్వింటాకు రూ. 2369 చొప్పున మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కొనుగోలు కేంద్రాల్లో సైతం అధికారులు కొర్రీలు పెడుతున్నారు. తేమ, తాలు అంటూ బీ గ్రేడ్ మాత్రమే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఆత్మకూరు (ఎం) మండలంలో 14 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం నాలుగు గ్రామాల్లో మాత్రమే వడ్లు కొంటున్నారు. మిగతా చోట్ల ధాన్యం కొనకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.