కట్టంగూర్, జూన్ 21: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గోదావరిపై 968 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు వార్థ, తుమ్మిడిహట్టికి 20 టీంఎసీల ఇచ్చేందుకు సూత్రపాయంగా అనుమతి ఇచ్చేందుకు ఒప్పుకుందని తెలిపారు. గోదావరిలో 1000, కృష్ణాలో 500టీఎంసీలు ఇచ్చి, ఏపీ ఎన్ని టీఎంసీలైన దోచుకోవచ్చని ఎట్లా మాట్లాడుతావంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డికి బ్యాగులు గురించి తప్ప బేసిక్స్, బేసిన్ల గురించి తెల్వదన్నారు.
దేవాదుల, బనకచర్ల ఎక్కడుందో తెలియని మూర్ఖుడని, బూతులు మాట్లడినట్లు కాదని నీళ్ల గురించి మాట్లాడాలన్నారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందని, నల్లమల్ల తెలంగాణ కిందకే వస్తుందా అని అధికారులను అడగడం రేవంత్ అవగాహనలేమికి నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యక్తి సీఎంగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. ఏపీ ప్రభుత్వం బనకచర్లను ఆరు నెలల నుంచి కడుతూ కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులకు లేఖలు రాస్తూ వారిని కలుస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
దేవాదుల ఏ బేసిన్లో ఉన్నదో సీఎంకు తెలియదని, సామాన్య రైతునో, స్కూల్ పిల్లాడినో అడిగినా గోదావరిపై ఉందని చెబుతారని, వారికున్న జ్ఞానం కూడా సీఎంకు లేదన్నారు. అవగాహన లేని మాటలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువుతీస్తున్నాడన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహా, నాయకులు రెడ్డిపల్లి మనోహర్, నోముల వెంకటేశ్వర్లు, శ్రీరాద రామకృష్ణ, పోగుల అంజయ్య, యర్కల మల్లేష్, యర్కల శ్రీను, జిల్లా యాదయ్య తదితరులు పాల్గొన్నారు.