యాదగిరిగుట్ట, జనవరి16 : నార్మూల్ సంస్థకు చెందిన స్థిరాస్తులు విక్రయించేందుకు ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, రైతుల డబ్బులతో కొనుగోలు చేసిన భూములను విక్రయానికి పాల్పడితే ఊరుకునేది లేదని నార్మూల్ తాజా మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి అన్నారు. గత నాలుగు నెలలక్రితం జరిగిన పాలక మండలి ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి నార్మూల్ సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. యాదరగిరి పట్టణంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నార్మూల్ సంస్థకు చెందిన చిట్యాలలో 32 ఎకరాలు, మిర్యాలగూడలో 1.20 ఎకరాల భూమి దాదాపుగా రూ. 75 కోట్ల ఆస్తులను ప్రస్తుత చైర్మన్ విక్రయించి నార్మూల్ సంస్థను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆలేరు నియోజకవర్గంలో ఎక్కువ పాడిపంటపైనే రైతులు ఆధారపడ్డారని, ఇక్కడి రైతులకు రోడ్డున పడేసేందుకు ప్రస్తుత పాలకవర్గం కుట్రలు చేస్తున్నదని తెలిపారు. నార్మూల్ సంస్థ రూ. 50 కోట్ల నష్టాల్లో ఉన్న సమయంలో తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని, రోజుకు 40 వేల లీటర్ల పాల విక్రయాలను 1.20 లక్షల లీటర్ల వరకు పెంచి నష్టాలను అధిగమించే ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. రెండేండ్ల పాలనలో తాను చేసిన అభివృద్ధిని ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. నాలుగు నెలల పాలనలో చేసిన అభివృద్ధిపై తాజా చైర్మన్ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. గతంలో రోజుకు 95 వేల లీటర్ల పాలను మార్కెటింగ్ చేసి విక్రయాలు జరిపామని తెలిపారు. పాడి రైతుల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా లీటరు పాలకు రూ. 5 పెంచామన్నారు. గత పాలక మండలి ఎన్నికల్లో స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు వచ్చి హామీలు గుప్పించారని, 300 మంది పాల సంఘం చైర్మన్లతో క్యాంపు నిర్వహించి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.
మమ్మల్ని గెలిపిస్తే రూ.5 బోసన్, రూ. 30 కోట్ల ప్రభుత్వ గ్రాంట్స్‌తోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని హామీలిచ్చారని, నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. గతంలో 95 వేల లీటర్లు విక్రయించినా నష్టాల్లో నడిచే సంస్థను ప్రస్తుతం కేవలం 45 వేల లీటర్ల విక్రయించి ఎలా అభివృద్ధి చేస్తారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లకు పాల సరఫరా, యాదగిరిగుట్ట దేవస్థానంతో పాటు చెర్వుగట్టు, వేముల వాడ దేవస్థానాలకు నార్మూల్ నెయ్యిని రద్దు చేసి ప్రస్తుత ప్రభుత్వం సంస్థను దీనావస్థలోకి నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ డెయిరీకే అన్ని అనుమతులివ్వడంతోపాటు రూ. 100 కోట్లు గ్రాంట్స్‌ను మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నార్మూల్ డెయిరీకి ఎందుకు ఇవ్వడం లేదో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలన్నారు.
గుట్టకు నార్మూల్ నెయ్యిని రద్దు చేసి విజయ డెయిరీకి సరఫరాను అనుమతినిస్తుంటే ఇక్కడి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. భూ దందాలు, భూములకు కొల్లగొట్టేపనిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. నార్మూల్ సంస్థను నాశనం చేసేందుకు భూములను విక్రయిస్తామంటే ఊరుకునేది లేదని, త్వరలో దీనిపై మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి వివరిస్తామని తెలిపారు. సమావేశంలో నార్మూల్ డైరెక్టర్ కందాల అలివేలు రంగారెడ్డి, మాజీ డైరెక్టర్లు వెంకటరామిరెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, పాల సంఘం చైర్మన్లు మారెడ్డి కొండల్‌రెడ్డి, సందిళ్ల భాస్కర్‌గౌడ్, గడ్డం భరత్‌గౌడ్, ఒగ్గు భిక్షపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్, ఉప సర్పంచ్ రేపాక స్వామి, నాయకులు పాండవుల భాస్కర్‌గౌడ్, పల్లె సంతోష్ పాల్గొన్నారు.