సూర్యాపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల బుధవారం ర్యాలీగా తరలి వెళ్లారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆవిర్భావ సభ నిర్వహించగా ఉమ్మడి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతే ప్రతిష్టాత్మకంగా జనసమీకరణ చేపట్టారు. ఆయా నియోకవర్గాల నుంచి ఖమ్మం తరలి వెళ్లే వాహనాలను ఎమ్మెల్యేలు ప్రారంభించగా సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించడంతో పాటు సాధారణ కార్యకర్తలతో కలిసి సూర్యాపేట మండలం సోలిపేట గ్రామం నుంచి లారీలో వెళ్లారు. ఎనిమిదిన్నరేండ్ల కాలంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిడం. మరో పక్క కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ, రాష్ర్ర్టాల హక్కులను కాలరాస్తుండడంతో సహించని సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు తమకు కావాలని పక్క రాష్ర్టాల ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. దాంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలనే కోరుతున్నారు. దాంతో తెలంగాణ మోడల్ అభివృద్ధ్ది దేశానికి అవసరం అని భావించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చారు. ఆ వెంటనే వివిధ రాష్ర్టాల నేతలు హైదరాబాద్‌కు క్యూ కడుతూ కేసీఆర్‌ను కలిసి వెళ్తుండడం ఆయా రాష్ర్టాల్లో బీఆర్ఎస్ కమిటీలు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఖమ్మంలో 5 లక్షల మందితో ప్రతిష్టాత్మకంగానిర్వహించగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
ఖమ్మం సభకు బీఆర్ఎస్ శ్రేణులకు తోడు సాధారణ ప్రజలు తరలి వెళ్లడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తొలుత అనుకున్న దానికంటే అదనంగా భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. సభకు జన సమీకరణ కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో అత్యంత ప్రణాళికా బద్ధ్దంగా ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లా పార్టీల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాను ఆనుకొని ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి నియోజకవర్గానికి 30 వేల చొప్పున మొత్తం 1.20లక్షల మంది తరలి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. అయితే అంతకు మించి 1.35 లక్షల వరకు తరలి వెళ్లినట్లు వాహనాల సర కనిపించింది. నల్లగొండ, యాదాద్రి జిల్లాల నుంచి టీఆర్ఎస్ ప్ర జాప్రతినిధులు, పార్టీ శ్రేణులు 30 వేల వరకు తరలి వెళ్లారు.
ఖమ్మం సభకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారు తరలి వెళ్లారు. గులాబీ జెండాలతో అలంకరించి జెండాలను చేత పట్టుకొని వేలాది వాహనాల్లో తరలి వెళ్తుంటే రహదారులన్నీ కిటకిటలాడాయి. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వాహనశ్రేణిని ప్రారంభించగా హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌తో పాటు నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లగొండలో జడ్పీ చైర్మన్ బండనరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
నకిరేకల్, జనవరి 18 : ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు నకిరేకల్ నుంచి ఆ పార్టీ శ్రేణులు బుధవారం భారీగా తరలి వెళ్లారు. దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. అంతకు ముందు క్యాంప్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
నల్లగొండ : ఖమ్మం బహిరంగ సభకు నల్లగొండ నియోజక వర్గం నుంచి గులాబీ దండు పెద్ద ఎత్తున కదిలింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సభకు బయల్దేరగా ఎన్జీ కళాశాలలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మండలాల నుంచి కార్యకర్తలు ఈ సభకు భారీ ఎత్తున సొంత వాహనాలు, బస్సుల్లో బయల్దేరారు. తరలిన వారిలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్, కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండలాల అధ్యక్షులు ఐతగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.