ఆదివారం 24 జనవరి 2021
Nagarkurnool - Nov 28, 2020 , 02:43:53

పట్టభద్రుల చైతన్యం

పట్టభద్రుల చైతన్యం

  • ఎమ్మెల్సీ ఎన్నికలకు దరఖాస్తుల వెల్లువ
  • ఆన్‌లైన్‌ ఓటు నమోదుకే 95 శాతం మొగ్గు
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో  34,380 దరఖాస్తులు
  •  దరఖాస్తుల పరిశీలనలో అధికారులు

    నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపడుతోంది. ఇందులో భాగంగా పాత ఓటర్లను రద్దు చేసి కొత్తగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. దీని ప్రకారం ఈనెల 6వ తేదీ నాటికి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు అందించవచ్చని పేర్కొంది. దీంతో ఉన్నత విద్యావంతులైన పట్టభద్రులు తమ చదువుకు న్యాయం చేసేలా ఓటు హక్కు నమోదు ద్వారా చాటి చెప్పారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మొత్తం 34,380 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఇందులో 34,097 మంది ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేసుకోవడం విశేషం. కేవలం 293 మంది మాత్రమే ఆఫ్‌లైన్‌లో చేసుకొన్నారు. ఇలా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రులు చైతన్యంగా ముందుకొచ్చారు. 2017 నాటికి ఉత్తీర్ణులైన పట్టభద్రులకు ఓటరుగా నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కాగా ఐదారేళ్లలో ఓపెన్‌ వర్సిటీల ద్వారా వేలాది మంది కొత్తగా పట్టభద్రులుగా ఉత్తీర్ణులయ్యారు. దీనికితోడు టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్ర ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్వయంగా జిల్లా కేంద్రంలో పట్టభద్ర ఓటర్ల నమోదులో పాల్గొని అవగాహన కూడా కల్పించారు. ఇక ఎమ్మెల్యేలు ఓటర్ల నమోదును ఉద్యమంలా చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల వివరాలను సేకరించి ఓటర్లు నమోదు చేసుకునేలా వివరించారు. తద్వారా పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదయ్యారు.


దీని వల్ల దాదాపుగా 95 శాతానికిపైగా ఆన్‌లైన్‌ ఓటు నమోదుకే మొగ్గు చూపడం గమనార్హం. ఇలా పట్టభద్రులు చేసిన దరఖాస్తులను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. పట్టభద్రులు ఇచ్చిన సర్టిఫికెట్లను ఇంటింటికీ వెళ్లి సరి చూస్తున్నారు. కాగా ఓటర్ల నమోదుకు పట్టభద్రుల నుంచి ఇంకా డిమాండ్‌ వస్తోంది. ఈ అంశంపై స్పందించిన ఎన్నికల సంఘం డిసెంబర్‌ 1 నుంచి మరో దఫా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ ప్రకటన చేసింది. దీనివల్ల మరోసారి పట్టభద్రుల ఓటర్ల నమోదుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు వేగిరం చేశారు. ఈ వారంలోపు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఓటర్లుగా ధ్రువీకరించనున్నారు. 

జిల్లాలో 34,380 దరఖాస్తులు 

  నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మొత్తం 34,380 దరఖాస్తులకు రాగా అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో 11,518 దరఖాస్తులు, అత్యల్పంగా కొల్లాపూర్‌ నుంచి 6,870 అందాయి. మొత్తం మీద విద్యావంతులైన పట్టభద్రులు ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు చూపిన చొరవపై అధికారులు ప్రశంసిస్తున్నారు.

 పట్టభద్రుల నుంచి స్పందన 


  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల దరఖాస్తులకు స్పందన వచ్చింది. పట్టభద్రులందరూ ఆన్‌లైన్‌ ద్వారానే అధికంగా ఓటు కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా పరిశీలన చేపడుతున్నాం. ఈనెలాఖరుకు పూర్తి చేసి ఓటర్ల నమోదు చేపడుతాం. తదుపరి ఎన్నికల సంఘం సూచనతో కొత్తగా మరోసారి ఓటు హక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ చేపడుతాం.

- మధుసూదన్‌ నాయక్‌, డీఆర్‌వో , కందనూలుlogo