సోమవారం 25 జనవరి 2021
Nagarkurnool - Oct 28, 2020 , 02:10:15

ఛీజేపీ

ఛీజేపీ

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : దుబ్బాకలో బీజేపీ మనీ పాలిట్రిక్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు సైతం ఎన్నికల్లో పాల్గొనేలా.., డబ్బులతో ప్రలోభాలకు గురికాకుండా చేసేలా విధించిన వ్యయపరిమితి నిబంధనలను బీజేపీ అభాసుపాలు చేసింది. రూ.18 లక్షలకుపైగా బీజేపీ అభ్యర్థి బంధువు నివాసంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే ప్రచార రాద్ధాంతానికి దిగింది. 

ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు..

ఎన్నికల్లో ఓటు హక్కు కీలకం. ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు గురికాకుండా ఉండేలా రాజ్యాంగంలో నిబంధనలు విధించింది. దీని ప్రకారం అభ్యర్థులకు వ్యయ పరిమితి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.28 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. సెక్షన్‌ 171(బీ) ప్రకారం పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో నిర్ణయించిన పరిమితికి మించి డబ్బులు ఖర్చు చేయకూడదు. పార్టీ ప్రచార కార్యక్రమాలకు వినియోగించే జెండాలు, కండువాలు, ఫ్లెక్సీలు, వాహనాలు, కార్యకర్తలకు భోజనాలు వంటి ప్రతీ ఖర్చుకూ లెక్కలు కడతారు. దీనికోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా ఫ్లయింగ్‌ స్కాడ్‌, స్టాటిస్టికల్‌, వీడియో సర్వైలైన్స్‌ బృందాలు ఏర్పాటు చేస్తుంది. నియోజకవర్గ శివార్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు. ఈ బృందాల పర్యవేక్షణ మొత్తం ఎన్నికల అధికారి కనుసన్నల్లో జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ఫలితాలు వెల్లడించే వరకూ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, ఎన్నికల అధికారులు పనిచేస్తారు. ఎన్నికల్లో వ్యయపరిమితి మించి ఖర్చు చేయకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. పోటీ చేసే పార్టీలు 75 రోజుల్లో, అభ్యర్థులు 30 రోజుల్లో లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభపర్చేదుకు వినియోగించే మందు, డబ్బుల పంపిణీని ఈ బృందాలు అడ్డుకుంటాయి. చెక్‌పోస్టుల ద్వారా నియోజకవర్గంలోకి వచ్చే వాహనాలన్నింటినీ సోదాలు చేస్తారు. రూ.50వేలకు మించి డబ్బులు తీసుకెళ్తే సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అంతకు మించి డబ్బులు దొరికితే పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఈ బృందంలో రెవెన్యూ అధికారి కూడా ఉంటారు. ఎక్కువ డబ్బులు ఎవరిదగ్గరైనా ఉన్నట్లు సమాచారం ఉంటే నేరుగా వెళ్లి తనిఖీలు చేసే అధికారం బృందానికి ఉంటుంది. పోటీ చేసే ప్రతి అభ్యర్థినీ ఈ బృందాలు కనిపెట్టుకుని ఉంటాయి. ఉదయం ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి రాత్రి ఇంటికి చేరుకునే వరకు గమనిస్తూనే ఉంటారు. ఇలా అభ్యర్థులకు రక్షణ కల్పించడంతోపాటు ఎన్నికల నిబంధనల అమలు జరుగుతుంది. సమాచారం ఉంటే.. సెర్చ్‌ వారంట్‌ ఇచ్చి ఇండ్లల్లోనూ తనిఖీలు చేస్తారు. వీడియో సర్వైలైన్స్‌ బృందాలు ప్రతి తనిఖీని రికార్డు చేస్తాయి. ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వం, పార్టీల ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తుంది. ఇలా ఎన్నికల్లో డబ్బుల పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల నిబంధనలను అధికారులు స్పష్టంగా అమలు చేస్తారు. 

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీడియో సర్వైలైన్స్‌ బృందాలతోపాటు ఎన్నికల అధికారులు సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు అంజన్‌రావు ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ ఘటనలో రెడ్‌హ్యాండెడ్‌గా రూ.18లక్షలకు పైగా పట్టుబడ్డాయి. ఈ డబ్బులు ఓటర్లకు పంపిణీ చేసేందుకేనని వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం సిద్దిపేట పోలీసులు విడుదల చేశారు. అయినా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు పోలీసులపై దుష్ప్రచారం చేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నానికి దిగడం కొసమెరుపు. ఈ ఘటనతో బీజేపీ లబ్ధిపొందడం మాట అటుంచితే ఉన్న పరువు సైతం పోగొట్టుకుందనేది రాజకీయ విశ్లేషణ. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఇస్తున్న మెజార్టీ విజయాలను కమలం పార్టీ కుయుక్తులు అడ్డుకోలేవనని ప్రజలు, దుబ్బాక ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. 

బీజేపీ డ్రామాను ఎవ్వరూ నమ్మరు..

తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుండటంతో ప్రజలు ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నారు. దుబ్బాకలోనూ టీఆర్‌ఎస్‌కు విజయం ఖాయమైంది. మెజార్టీ అంతరాన్ని తగ్గించుకొని పరువు కాపాడుకునేందుకు బీజేపీ డబ్బుల పంపిణీకి పూనుకోవడం సిగ్గుచేటు. బీజేపీ అభ్యర్థి బంధువు డబ్బులు తమవేనని వాంగ్మూలం ఇచ్చినా.. పోలీసులు, టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీన్ని దుబ్బాక ఓటర్లు, తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని తెలంగాణలో ప్రజలు ఆదరించరు.            

- జక్కా రఘునందన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌

ప్రత్యేక బృందాలతో ఎన్నికలు..

అసెంబ్లీ ఎన్నికలు ఎలక్షన్‌ కమిషన్‌ పర్యవేక్షణలో జరుగుతాయి. స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులంతా దాని పరిధిలోనే పనిచేస్తారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయకుండా స్టాటిస్టికల్‌, వీడియో సర్వేలైన్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు పని చేస్తాయి. నియోజకవర్గ శివార్లలో చెక్‌ పోస్టులు ఉంటాయి. పోటీ చేసే అభ్యర్థికి నిర్దేశించిన మేరకు ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. డబ్బులు దొరికితే పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం లెక్క చూపిస్తే తిరిగి డబ్బులు ఇస్తారు. 

- మధుసూదన్‌ నాయక్‌, డీఆర్వో, నాగర్‌కర్నూల్‌logo