బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Mar 10, 2020 , 00:31:04

మాణికేశ్వరిమాతకు కన్నీటీ వీడ్కోలు

మాణికేశ్వరిమాతకు కన్నీటీ వీడ్కోలు

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యానగుంది  సూర్యనంది క్షేత్రంలో మాతా మాణికేశ్వరి  అంతిమ సంస్కారాలు లక్షలాది మంది భక్తుల మధ్య సోమవారం జరిగాయి. భక్తుల హృదయాల్లో ఆరాధ్యదైవంగా నిలిచిన మాణికేశ్వరి మాత ఈ నెల 7న శివైక్యం చెందిన నేపథ్యంలో రెండు రోజుల పాటు మాత పార్థివ దేహాన్ని భక్తుల సందర్శనార్థం ఉంచారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తదిర ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున  తరలివచ్చి మాతను చివరి సారిగా దర్శించుకున్నారు. ఉదయం సైతం భక్తులకు అమ్మవారి పార్థ్ధివ దేహాన్ని సందర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. మధ్యాహ్నం 12గంటల తరువాత అంతిమ సంస్కార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కర్ణాటక పోలీసులు గౌరవ వందనం సమర్పించడంతో సూర్యనంది క్షేత్ర కమిటీ సభ్యులు మాత అంతిమ కార్యక్రమాలను సంప్రదాయ రీతిలో ఆరంభించారు. మధ్యాహ్నం వరకు కార్యక్రమం నిర్వహంచి మాత గతంలో సజీవ సమాధికోసం ఏర్పాటు చేసిన సమాధిలోనే ఉంచి అంతిమ  కార్యక్రమాలను పూర్తిచేసారు.

భారీగా తరిలి వచ్చిన భక్తులు

మాత అంతిమ సంస్కారాలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక వాహనాలలో వివిధ రాష్ర్టాలనుంచి భక్తులు తరలిరావడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులు మాతను చివరిసారిగా దర్శించుకొని కన్నీటి పర్యాంతం చెందారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం బరువెక్కిన హృదయాలతో తిరుగుబాట పట్టారు. కాగా అమ్మవారి అంతిమ సంస్కార కార్యక్రమాలలో కర్నాటక రాష్ర్టానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరై మాత అంతిమ సంస్కారాలలో పాల్గొన్నారు.


logo