మంగళవారం 07 జూలై 2020
Medchal - Jun 07, 2020 , 01:55:21

మేడ్చల్‌ వార్షిక రుణ ప్రణాళిక రూ. 13,177 కోట్లు

మేడ్చల్‌ వార్షిక రుణ ప్రణాళిక రూ. 13,177 కోట్లు

 మేడ్చల్  : ప్రాధాన్యతా రంగాలకు 43 శాతం రుణాలను తప్పనిసరిగా ఇవ్వాలని బ్యాంకులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో రూ.13,177 కోట్ల వార్షిక రుణ ప్రణాళికలో 5,672 కోట్లను కేటాయించారు. ఇందులో పరిశ్రమ (సూక్ష్మ, చిన్నతరహా)లకు రూ.3,545 కోట్లు, వ్యవసాయానికి రూ.799.57కోట్లు, గృహ నిర్మాణ రుణాలకు రూ.827.94 కోట్లు, విద్యారంగానికి రూ.276.68 కోట్లుగా నిర్ధారించారు. అప్రధాన్యతా రంగాలకు అంటే కార్పొరేట్‌, భారీ, మధ్య తరహా పరిశ్రమలతో పాటు 30 లక్షల నిర్మాణ వ్యయం కలిగిన ఇంటి నిర్మాణాలకు సంబంధించిన రుణాలను అప్రధాన్యతా రంగాల కింద చేర్చారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వీటికి 56.95 శాతం ఉంది. 

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో...

 జిల్లాలో సుమారు 15వేల మంది ఆత్మ నిర్భర్‌ అర్హులుగా గుర్తించారు. వీరికి రూ. 2500 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. వీటిలో పారిశ్రామిక రంగాలకు 20 శాతం, మహిళా గ్రూపులకు 10 శాతం, వీధి వ్యాపారులకు రూ.10వేల ఆర్థిక సాయం, వ్యవసాయానికి 10 శాతం, ఇతర రంగాలకు మిగిలిన రుణాలను ఇస్తారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు నష్టపోయిన రైతులకు ఈ సీజన్‌లో మొదటి ప్రాధాన్యతగా రుణాలివ్వడంతో పాటు గతంలో తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని కలెక్టర్‌ బ్యాంకు అధికారులను ఆదేశించారు. అలాగే మహిళా రైతులకు పంట రుణాలతో పాటు పావలా వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలను సైతం సకాలంలో అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

ముందస్తు ప్రణాళిక 

జిల్లాలో సుమారు 25-30వేల మంది పంటలను సాగు చేస్తున్న రైతులున్నారు. ఇందులో సుమారు 14వేల మంది వరి సాగు చేస్తుండగా, మిగిలిన వారు పండ్లు, పూలు, కూరగాయల సాగు చేస్తున్నట్లు వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలోనే జిల్లాలో వరిని సాగు చేసే రైతులతో పాటు ఈ ఏడాది ఇతర హార్టికల్చర్‌ పంటలను సాగు చేసే వారికి పంట రుణాలను ఇచ్చే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే రైతు సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 

జిల్లాలో  ప్రతి రైతుకు సకాలంలో పంట రుణాలిచ్చేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇందులోభాగంగానే క్రెడిట్‌ ప్లాన్‌ను రూపొందించడంతో పాటు  5న బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అలాగే భూములు, వాతావరణానికి అనుకూలంగా ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేసే అంశాలపై రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించి పంట రుణాలను అందిస్తాం. -డా.వాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ 


logo