బుధవారం 01 ఏప్రిల్ 2020
Medchal - Feb 20, 2020 , 00:30:40

ఆట కోసం.. అప్పు

ఆట కోసం.. అప్పు
  • యువతరాన్ని పక్కదోవ పట్టిస్తున్న ‘ఆన్‌లైన్‌ పెయిడ్‌ గేమ్‌' వెబ్‌సైట్లు
  • కొత్త వ్యసనాలకు బానిసలై చితికిపోతున్న విద్యార్థులు
  • కొత్తగా తోడైన ఇన్‌స్టంట్‌ రుణాల యాప్‌లు
  • అప్పులు తీసుకొని మరీ.. ఆన్‌లైన్‌ గేమ్‌లపై పెట్టుబడి
  • ఇంజినీరింగ్‌ విద్యార్థి అదృశ్యం కేసులో వెల్లడవుతున్న దిగ్భ్రాంతికర వాస్తవాలు


’సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : ఆన్‌లైన్‌ పెయిడ్‌ గేమ్‌లు యువతను అప్పులపాలు చేస్తున్నాయి. ఇన్‌స్టంట్‌ యాప్‌లలో రుణాలు తీసుకొని మరీ ‘ఆట’ల్లో పోగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లపై పెట్టుబడి పెట్టి ఇటీవల ఇంజినీరింగ్‌ విద్యార్థి అదృశ్యమైన ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడవుతున్నాయి. అతడు క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు పెయిడ్‌ గేమ్‌లు ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకోసం పలు ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. లోన్‌ గడువు ముగియడంతో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులకూ ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు సమాచారం. ఈ అప్పు విషయం అందరికి తెలిసిపోవడంతోనే అతడు కాలేజీ హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడని పోలీసులు భావిస్తున్నారు.


ఇంజినీరింగ్‌ విద్యార్థి అదృశ్యం

ఫిబ్రవరి 11న ఇండియా న్యూజిలాండ్‌ మధ్యన మూడో వన్డే జరిగిన రోజు ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి సెకండ్‌ఇయర్‌ విద్యార్థి అదృశ్యమయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక ఆధారాల సేకరణలో పడ్డారు. కానీ ఆ విద్యార్థి అదృశ్యమైన సమయం నుంచి దాదాపు 3 గంటల పాటు ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పోలీసులకు క్లూ లభించలేదు. విద్యార్థి తనంతట తానే బయటికి వెళ్లిపోయినందున అది కిడ్నాప్‌ కాదని ధ్రువీకరించుకుని దర్యాప్తు కొనసాగించారు.


క్రికెట్‌ అంటే పిచ్చి.. 

మరింత లోతుగా కేసు విచారణ చేస్తున్న పోలీసులకు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థికి క్రికెట్‌ అంటే ప్రాణమని తేలింది. దాని కోసం తరగతులకు కూడా హాజరుకాకుండా ఉండేవాడు. అందులో రంజీ మ్యాచ్‌లైనా సరే దానికి సంబంధించి లైవ్‌ టీవీల్లో ఉన్నా, సోషల్‌ మీడియాలో ఉన్నా అతను వాటిని చివరి వరకు వీక్షించేవాడు. ఈ నేపథ్యంలోనే అతను అదృశ్యమైన రోజు కూడా మధ్యాహ్నం వరకు కళాశాల క్యాంటీన్‌లో మ్యాచ్‌ చూశాడు. ఆ తర్వాత టీ-షర్టు, మినీ ప్యాంట్‌ నుంచి దుస్తులు మార్చుకుని ప్యాంటు షర్టు ధరించి బయటికి వెళ్లాడు. అయితే అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ కళాశాల ప్రాంగణంలోనే చివరి సారిగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. ఆ తర్వాత ఫోన్‌ లొకేషన్‌ దొరకడం లేదు. 


అప్పులు చేసి.. ఆన్‌లైన్‌ గేమ్‌లు

ఫోన్‌ నంబర్‌ను మరింత విశ్లేషిస్తే పోలీసులు అవాక్కయ్యే విషయాలు తెలిసొచ్చాయి. ఆ విద్యార్థి ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు పలు పెయిడ్‌ గేమ్‌ల కోసం డబ్బులు వెచ్చించినట్లు తెలిసింది. ఆ ఆటల కోసం ఆన్‌లైన్‌లో ఉండే వెబ్‌సైట్ల నుంచి రుణాలు పొందినట్లు వెల్లడైంది. అలా రుణాలు పొందే సమయంలో తన ఆధార్‌ కార్డు, అతని ఫోన్‌ నంబరు, తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు, సోదరుడి ఫోన్‌ నంబరును ష్యూరిటీగా ఇచ్చాడు. సదరు డబ్బులు తిరిగి చెల్లించే గడువు గడిచిపోవడంతో ఆ రుణ సంస్థల నుంచి ఇటీవల మాటిమాటికి తల్లిదండ్రులకు కాల్స్‌ వచ్చాయి. ఈ రుణాల విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందనే కారణంగా అతను కళాశాల హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడని పోలీసులు బావిస్తున్నారు. 


ఒక్కడే కాదు.. వందల్లో ఉన్నారు

చాలా మంది విద్యార్థులు ఈ ఆన్‌లైన్‌ పేయిడ్‌ గేమింగ్‌కు అలవాటు పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నది. దీని కోసం వారు పలు సంస్థలు ఇచ్చే ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని గేమింగ్‌, బెట్టింగ్‌లలో డబ్బులు పెడుతున్నట్లు తెలిసింది. ఇలా విద్యార్థులు ఈ గేమింగ్‌ ఆటలకు వ్యసనపరులుగా మారుతున్నారని పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఈ బెట్టింగ్‌ల కోసం వేలాది రూపాయలు అప్పులు తీసుకుని బోల్తా పడుతున్నారు. ఇంట్లో వారు తీవ్రంగా మందలిస్తారని వణికిపోయి చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 


భవిష్యత్తును చిద్రం చేస్తున్న ఆన్‌లైన్‌ క్రీడలు

వికృత ఆలోచనలను పెంచే అశ్లీల వెబ్‌సైట్లను ఎలా కట్టడిచేయాలో అర్థం కాక తలలుపట్టుకుంటుంటే ఇప్పుడు మరో ‘ఆన్‌లైన్‌' ఉపద్రవం ముంచెత్తుకొస్తున్నది. అచ్చం ఆన్‌లైన్‌ రమ్మీ లాగా క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి డబ్బులిచ్చి ఆడే కొత్త జూదపు ఆటలు పుట్టుకొచ్చాయి. ఆన్‌లైన్‌లో విద్యార్థులను ఆకర్షిస్తున్న ఈ కొత్త పోకడలు విద్యార్థుల చదువులను, యువతరం భవిష్యత్తును చిద్రం చేస్తున్నాయి. పదిరోజుల కిందట కనిపించకుండా పోయిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి కేసును దర్యాప్తు చేస్తుండగా సైబరాబాద్‌ పోలీసులకు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలిసొచ్చాయి.


logo
>>>>>>