జహీరాబాద్, జనవరి 19: విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సంక్రాంతి పండుగకు తరలిరావడంతో గ్రామాలు కళకళలాడాయి. వారంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, ఝరాసంగం తదితర మండల ప్రాంతాలకు పిల్లా పాపలతో కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు రావడంతో కిక్కిరిపోయాయి. హైదరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, తాండూర్, వికారాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో 92 ఆర్టీసీ బస్సుల్లో 63 ఆర్టీసీ బస్సులు, 29 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎలాంటి రుసుం చెల్లించకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణించే అవకాశం కల్పించింది. ఫలితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. కానీ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం ప్రయాణికులు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ ఆర్డీసీ బస్టాండ్ గుండా హైదరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, తాండూర్, నిజామాబాద్, వికారాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.
పిల్లాపాపలతో పాటు లగేజీతో బస్సులో ఎక్కేందుకు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సీట్లు దొరకడం ఏమో కానీ నిల్చుండి వెళ్లేందుకు కూడా బస్సులో చోటు దొరకడం గగనంగా మారింది. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. గంటల తరబడి వేచి చూడడం కంటే వచ్చిన బస్సులో ఎలాగైన వెళ్లాల్సిందే అని ఆదివారం జహీరాబాద్ బస్టాండ్‌లో తాండూర్ వైపు వెళ్తున్న బస్సు టాప్‌పైకి మహిళ ఎక్కి కూర్చుంది. న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల పరిధిలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా మండలాల మీదుగా జహీరాబాద్, నారాయణఖేడ్, తాండూర్, హైదరాబాద్, ఝరాసంగం తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే బస్సులో ప్రయాణికులు నిండిపోవడంతో స్టేజీల వద్ద ఆగకుండా వెళ్తున్నాయి. దీంతో ఆటోలు, జీపులను ఆశ్రయించి వెళ్తున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండడంతో మహిళలు బస్సులోనే ప్రయాణిస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.