జహీరాబాద్/కోహీర్, డిసెంబర్ 29: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలిగించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. జహీరాబాద్ ప్రాంతంలోని పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో బైకులు, కార్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రమాదాలు జరిగి అనేక మంది అంగవైకల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రగాయాలతో దవాఖానల పాలయ్యారని వివరించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సభకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశానని గుర్తుచేశారు. కానీ ఇంతవరకు ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. ఝరాసంగంలో కేవలం ఆరు పడకల దవాఖాన ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సరిపోదన్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. 30 పడకల దవాఖాన ను వెంటనే మంజూ రు చేయాలని ఆయ న కోరారు.