జహీరాబాద్, ఫిబ్రవరి 11: ఎకరా, రెండు ఎకరాల భూమిలో 30 రకాల పంటలు పండిస్తున్న పేద మహిళలు దేశానికి ఆదర్శమని పలువురు అభిప్రాయ పడ్డారు. 23వ పాత పంటల జాతరను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శనివారం ఝరాసంగం మండలంలోని మాచున్నూర్లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీశ్, సీనియర్ జర్నలిస్టు అకాడమిషన్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఆర్.అఖిలేశ్వరి, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ పుమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి, ఫుడ్, ట్రేడ్ పాలసీ ఎనలిస్ట్ చండీగఢ్ డాక్టర్ దేవీందర్‌శర్మ, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసెడెంట్ షేక్ అన్వర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ డైరెక్టర్ డా.సివి.రత్నావతి, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ డాక్టర్.అర్చన పట్నాయక్ పాల్గొని చిరుధాన్యాల గురించి వివరించారు. అనంతరం చిరుధాన్యాలు సాగు చేస్తున్న మహిళా రైతులను సన్మానించారు. అంతకుముందు మహిళలు ముగింపు వేడుకలను జ్యోతి వెలిగి ప్రారంభించి, పాత పంటల విత్తనాలతో అలంకరించిన చేసిన ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు.
చిరుధాన్యాలతో ఆరోగ్య ‘సిరి’..
వర్షధారంగా సాగుచేస్తున్న చిరుధాన్యాల్లో అనేక పోషకాలున్నాయని, ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలతో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి మాత్రమే సాగు చేయడంతో మనుషుల్లో సోమరితనం పెరిగిందని, అదే చిరుధాన్యాలు సాగు చేసే రైతులు పని ఎక్కువగా చేయడంతో చురుకు ధనం పెరుగుతుందన్నారు. పాత పంటలో అధిక పోషకాలు ఉండడంతో ఎక్కువ మంది ఆహారం తీసుకునేందుకు ఇష్టపడుతారన్నారు. చిరుధాన్యాలు సాగు చేసే రైతులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. డీడీఎస్‌తో ప్రపంచంలో జహీరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఒకప్పుడు ఎర్ర మట్టి అంటే జహీరాబాద్ అనే వారు. ఇప్పుడు డీడీఎస్ చిరుధాన్యాలు అంటే జహీరాబాద్ అనే విధంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
మహిళా రైతులకు సన్మానం
వర్షాధారంగా పలు రకాల చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్న మహిళా రైతులను సన్మానం చేసిన అభినందించారు. జీవవైవిధ్య పంటలు సాగు చేస్తున్న న్యాల్కల్ మండలం హుసెళ్లికి చెందిన మహిళా రైతు చెరాగ్‌పల్లి పుణ్యమ్మ, ఉప్పర్పల్లితండాకు చెందిన కమిలిబాయి, కోహీర్ మండలంలోని బిలాల్‌పూర్‌కు చెందిన సునీత, బీడెకన్నెకు చెందిన మహిళా రైతు బుజ్జమ్మను సన్మానం చేశారు. తెలంగాణలోనే ఉత్తమ సేంద్రియ బెల్లం తయారు చేసిన ఎస్.నర్సిములుకు సన్మానం చేశారు. గ్రామీణ వాతావరణంలో పండగలు ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ సదస్సులో మచున్నూర్ గ్రామ సర్పంచ్ రాజుతో పాటు మహిళలు, రైతులు పాల్గొన్నారు.