సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 2: అర్హత గల ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్‌కుమార్ వ్యాస్ కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు కలెక్టర్లతో ఎస్ఎస్ఆర్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నితీశ్‌కుమార్ వ్యాస్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం-23లో భాగంగా ఓటరు జాబితా సవరణలతో పాటు 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత స్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండాలన్నారు. ఫాం-6, 7, 8లకు సంబంధించి అన్ని రికార్డులు సరిగ్గా నిర్వహించాలన్నారు. ఓటరు నమోదు విషయంలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు, అవగాహనలు కల్పించాలని సూచించారు. స్వీప్ కార్యక్రమాలపై కమిషనర్ ఆరా తీశారు.
సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ అర్హత గల ప్రతిఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల డిప్యూటీ కమిషనర్‌కు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు, ఓటరు నమోదు, సవరణ తదితర దరఖాస్తు ఫారాలతో పాటు జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు జాబితా అందుబాటులో ఉంచామన్నారు. గోడ ప్రతులు, కర పత్రాలు, మైకులు, సోషల్ మీడియా, టాం-టాం, కేబుల్ చానళ్లు, ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ఓటు నమోదు, ఓటరు జాబితా సవరణపై కళాజాత నిర్వహిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీపీవో సురేశ్‌మోహన్, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.