మీ అమ్మాయిని ప్రేమించా.. ఆమెతో పెళ్లి చేయండి.. లేదంటే ఆమె నగ్న ఫొటోలను బయటపెడతా అంటూ ఓ యువకుడు బెదిరింపులకు దిగాడు. యువతి కుటుంబసభ్యులు ఎంతగా బతిమిలాడినా ఒప్పుకోకుండా తన మాట మీదే ఉండిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అన్న.. సదరు యువకుడి బండరాయితో కొట్టిచంపాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్దూంపూర్ గ్రామానికి చెందిన యువతి, హైదరాబాద్ బోరబండకు చెందిన మహ్మద్ సాబిల్(21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారికి పెళ్లి చేయాలని యువతి కుటుంబసభ్యులను అడిగితే నిరాకరించారు. దీంతో తమ పెళ్లి చేయకపోతే.. యువతితో సాన్నిహిత్యంగా ఉన్న, నగ్న ఫొటోలను బయటపెడతానని బెదిరించాడు. ఈ క్రమంలో ఫొటోలు డిలీట్ చేయాలని యువతి అన్న అప్సర్ (34) పలుమార్లు బతిమిలాడాడు.
ఎన్నికార్లు కోరినా ఫొటోలు డిలీట్ చేసేందుకు సాబిల్ ఒప్పుకోలేదు. దీంతో అతన్ని అడ్డు తొలగించాలని అప్సర్ భావించాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందాం రమ్మని సాబిల్ను ముగ్దూంపూర్కు పిలిపించాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సారోల్ల సంతోశ్ (39)తో కలిసి సాబిల్ను కారులో ఎక్కించుకుని గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడ అప్సర్, సాబిల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రేక్తుడైన అప్సర్ బండరాయితో సాబిల్ తలపై కొట్టిచంపాడు. అనంతరం అప్సర్, సంతోశ్ అక్కడి నుంచి పారిపోయారు. కాగా, మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. అప్సర్, సంతోశ్లను అదుపులోకి తీసుకున్నారు.