సిద్దిపేట, నవంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు షూరు అయ్యాయి. రైతులు నారుమడులకు దున్నకాలు ప్రారంభించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే వానకాలం పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టింది. గత యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంచేసిన డబ్బులను విడుదల చేసి చేతులు దులుపుకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఒక పంటకు రూ. 5వేల చొప్పున రైతుబంధు ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ. 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9తో ఏడాది పూర్తికానున్నది. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చడం లేదు. రూ.2 లక్షల పంట రుణమాఫీ అని చెప్పి సగం మందికి మాత్రమే చేసి మిగతా రైతులకు చెయ్యిచ్చింది.
పాత మెదక్ జిల్లాలోని ప్రస్తుత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యాసంగి పనులను రైతులు ప్రారంభించారు. ఈసారి యాసంగిలో సిద్దిపేట జిల్లాలో అన్ని పంటలు కలిపి 3.82 లక్షల్లో ఎకరాల్లో సాగుకానున్నాయని, ఇందులో వరి 3.48లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. మెదక్ జిల్లాలో అన్ని పంటలు కలిపి 2.84లక్షల ఎకరాలు, ఇందులో వరి 2.65 లక్షల ఎకరాలు సాగు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని పంటలు కలిపి 2,01,193 ఎకరాలు అంచనా వేశారు. ఇందులో వరి 1.10 లక్షల ఎకరాల్లో, జొన్న 59 వేల ఎకరాలు, శనగ 20 వేలు, మిగతా ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే వానకాలం పంటలను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఎక్కువశాతం రైతులు దళారులకు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో రైతులు వ్యాపారులను ఆశ్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొన్నారు. కొన్న 72 గంటల్లో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వక పోవడంతో యాసంగి పెట్టుబడులకు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుభరోసాపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో యాసంగి, వానకాలం సీజన్‌కు ప్రారంభానికి ముందే రైతుబంధు సాయం వేయడంతో అన్నదాతలకు ఎంతో అక్కరకు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేయూత ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ఎన్నికల ముందు రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపింది. ఇక రైతుభరోసా ఏమిస్తదో అని రైతులు ఆశలు వదులుకుంటున్నారు. మే 2018లో కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేల చొప్పున అందించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు దానిని ఎకరాకు రూ. 5వేల చొప్పున పెంచి రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందించారు. కేసీఆర్ 11 విడతల్లో రైతుబంధు సాయం అందించారు.
సిద్దిపేట జిల్లాలో 3,20,921 మంది రైతులకు 313.96 కోట్లు, మెదక్ జిల్లాలో 2,60,104 మంది రైతులకు 194.90 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,60,320 మంది రైతులకు 376.02 కోట్ల రైతుబంధు అందించారు. 11 విడతల్లో సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637 రైతులకు రూ. 2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మంది రైతులకు రూ. 3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుబంధు కింద కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాలతో రైతులకు చేయూతనిచ్చింది. ఇప్పుడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అలాంటి చేయూత లభించక పోవడంతో సాగుకు తిప్పలు పడుతున్నారు.