చిన్నకోడూరు, ఆగస్టు 18: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న కాంగ్రెస్ నాయకులు రంగనాయకసాగర్‌కు నీళ్లు ఎట్ల వచ్చాయో చెప్పాలని చిన్నకోడూరు మండలం మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులోని రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాగునీరు రావడంతో గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, రైతులను అరిగోస పెడుతున్నట్లు మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేక పోతున్నారని, సీఎం రేవంత్ బీఆర్ఎస్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పాలన మరిచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదన్నారు.
రైతులకు సాగునీరు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మండిపడ్డారు. మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ రాయడంతో పాటు ప్రెస్‌మీట్ పెట్టి హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చి రంగనాయక్‌సాగర్‌లోకి నీటిని పంపింగ్ చేసిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. జిల్లా రైతుల పక్షాన హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.