బొల్లారం, డిసెంబర్ 1: కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో 2012లో బాచుపల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని అధికారులు ఓ అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. వైద్య సేవలు పొందడానికి వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీని బొల్లారానికి తరలించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు పలుమార్లు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు, కార్మికులు వాపోతున్నారు.
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సుమారు 200 పైచిలుకు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సుమారు 90వేల పైచిలుకు కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే 63 వేల మంది కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కార్మికుల వేతనం నుంచి నెలనెలా ఈఎస్ఐ కింద నగదు కోత విధిస్తున్నారు. అయితే బాచుపల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉండడంతో కార్మికులకు ఈఎస్ఐ సేవలు అందడం లేదు.
ఒకవేళ కార్మికులు ఈఎస్ఐ సేవలు పొందాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.కాలయాపనతో పాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. కాగా వీరిలో 80శాతం ఇతర రాష్ర్టాలకు చెందిన వారే ఉన్నారు. బొల్లారంలోని గాంధీనగర్ 284 సర్వే నెంబర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ కోసం కేటాయించిన స్థలంలో సీఎస్ఆర్ నిధులతో భవనాన్ని నిర్మించినా ఇప్పటి వరకు బాచుపల్లిలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సరీని బొల్లారానికి తరలించడంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరిశ్రమలు ఒకచోట డిస్పెన్సరీ మరోచోట ఉండడంతో ఇబ్బంది పడుతున్నాం. సకాలంలో వైద్యం అందడం లేదు. బాచుపల్లికి వెళ్లాలంటే సమయంతో పాటు ఆర్థిక భారం పడుతున్నది. స్థానిక ప్రైవేట్ క్లినిక్లను ఆశ్రయిస్తున్నాం. అధికారులు చొరవ తీసుకొని ఈఎస్ఐ డిస్పెన్సరీని బొల్లారానికి తరలిస్తే మాకు అన్ని విధాలా మేలు జరుగుతుంది.
– సంజీవ్, కార్మికుడు, బొల్లారం
కార్మికులకు అందుబాటులోనే వైద్యసేవలు అందించాలి. ఈఎస్ఐ డిస్పెన్సరీకి స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాం. నూత న భవనంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఈఎస్ఐ సేవలతో కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది.
– రోజాబాల్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్, బొల్లారం, సంగారెడ్డి జిల్లా