మహిళల భాగస్వామ్యంతో రాష్ర్టాభివృద్ధి సాధ్యమైందని, అభివృద్ధి, సంక్షేమంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ సర్కారేనని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా మహిళలకు గౌరవం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ప్రజాప్రతినిధులు అన్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో మహిళల పాత్ర గొప్పదన్నారు. మహిళలు చదువుతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. మహిళాభివృద్ధికి పెద్దపీట వేసి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితో సామాజిక భద్రత కల్పిస్తున్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్‌కు మరోసారి మహిళలు ఆశీర్వదించాలని కోరారు. మెదక్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించగా, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు జరిగాయి.
నర్సాపూర్, జూన్ 13: మహిళలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో అదే జరిగిందని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతం చేశారు. మహిళా ప్రజాప్రతినిధులను, మహిళ ఉద్యోగులను జ్ఞాపికతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీం కేసీఆర్ మహిళా సంక్షేమానికి ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారఖ్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.4,300 నుంచి రూ.13,650 వరకు, హెల్పర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.7,850 వరకు, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.7,800 వరకు, ఆశ వర్కర్ల వేతనాలు రూ.1,500 నుంచి రూ.9,750 వరకు పెంచినట్లు తెలిపారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటితో మహిళలకు నీటి తిప్పలు తప్పాయన్నారు.
పండుగలా తెలంగాణ దశాబ్ది
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామగ్రామాన పండుగల జరుపుకొంటున్నారని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గర్భిణి నుంచి ప్రసవం అయ్యే వరకు రాష్ట్రంలో ఉచితంగా వైద్యం అందుతున్నదన్నారు. మహిళా సంక్షేమానికి ఇప్పటికే ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నదని, నేటి నుంచి న్యూట్రీషన్ కిట్‌ను అందజేస్తారని తెలిపారు. మాతాశిశు మరణాల రేటు 90 శాతం నుంచి 43 శాతానికి తగ్గిందన్నారు.
మహిళలు ప్రభుత్వానికి అండగా ఉండాలి
సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని, మహిళలందరు ప్రభుత్వానికి అండగా ఉండాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి కోరారు. ఆరోగ్య మహిళా పథకాన్ని తీసుకువచ్చి మహిళలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. పరిశ్రమలో ఉపాధి కోసం 10 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పని చేసే చోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, ఆర్డీవో శ్రీనివాసులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా, సీడీపీవో హేమభార్గవి, వివిధ మండలాలకు చెందిన మహిళా ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.