నర్సాపూర్, నవంబర్ 22: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని మంత్రి వివేక్ అన్నారు. శనివారం నర్సాపూర్‌లోని సాయికృష్ణ గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, మహిళలకు ఇందిరమ్మ చీరలను మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..మహిళలకు వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ ద్వారా లోన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు నెలనెలా పంపిణీ చేసేలా మంత్రి వివేక్ చర్యలు తీసుకోవాలని కోరారు. హామీ ప్రకారం తులం బంగారం పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందిరమ్మ చీరలు స్వయం సహాయక సంఘాల మహిళలకే కాకుండా అందరు మహిళలకు పంపిణీ చేయాలని కోరారు. పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వర్షాలకు నల్లబడ్డ వడ్లను కొనాలన్నారు. సింగూరు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. చీరలు, చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై రేవంత్‌రెడ్డి నినాదాలు చేసి సభలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. మంత్రి వివేక్ సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
మంత్రి వారిని వారించకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు నినాదాలు ఆపకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు సైతం జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై సునీతమ్మా అంటూ ప్రతి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అధికారిక కార్యక్రమాలను చేపట్టామని, ఎన్నడూ పార్టీలపరంగా చేయలేదని, అధికారిక కార్యక్రమాలకు రాజకీయ రంగు పులమవద్దని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. అనంతరం రాయారావు చెరువులో చేపపిల్లలను మంత్రి, ఎమ్మెల్యే వదిలారు. కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్‌రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్లు, ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసిల్దార్ శ్రీనివాస్, లబ్ధిదారులు పాల్గొన్నారు.