చేర్యాల, జూలై 14 : తాము ఇండ్లు లేని పేదోళ్లం… కాంగ్రెస్ నాయకులు తమకు ఇండ్లు ఇవ్వలేదు…జనగామ ఎమ్మెల్యేరాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు మంజూరు చేయించారు.అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులేనని రిపోర్టు ఇచ్చారు. మీకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి మంజూ రు పత్రాలు తీసుకుపోయి ఇంటి నిర్మాణ పనులు మొ దలు పెట్టాలని ఆయా గ్రామాల కార్యదర్శులు లబ్ధిదారులకు ఆదివారం తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు తీసుకునేందుకు సోమవారం లబ్ధిదారులు వస్తే ఈరోజు ఇవ్వడం లేదు మరో రోజు ఇస్తామంటూ అధికారులు ప్రకటించారు.
ఆగ్రహానికి గురైన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చేర్యాల ఎంపీడీవో కార్యాలయంలోకి వెళ్లి బైఠాయించారు.ఉదయం 11గంటలకు ప్రారంభమైన మహిళల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. రెండు గంటల పాటు ఎంపీడీవో కార్యాలయంలో మహిళలు బైఠాయించిన అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. ఉదయం ప్రారంభమైన ఆందోళన సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఉదయం చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు ఆకలికి గురికావడంతో గమనించిన బీఆర్ఎస్ నాయకులు వారిని భోజనం చేయాలని కోరారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుటే కూర్చొని భోజనం చేస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఎవరు తమకు పట్టాలు ఇవ్వొద్దన్నారో తెలియజేయాలని మహిళలు నినాదాలు చేశారు. ఇండ్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డికి రుణపడి ఉంటామని, పత్రాలు రాకుండా అడ్డుకున్న వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటూ నినదించారు. ఆందోళన తీవ్రతరం కావడంతో ఎంపీడీవో మహబూబ్అలీ ఆందోళన చేస్తున్న వారిని కలిసి మరో రోజు పత్రాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశాడు. అనంతరం ఎంపీడీవో ఉన్నతాధికారులతో మాట్లాడి ఆందోళన తీవ్రతను తెలియజేయడంతో మంగళవారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇస్తామని జిల్లా స్థాయి అధికారులు హామీ ఇచ్చారు.
దీంతో జిల్లా అధికారులు ఇచ్చిన హామీని మహిళలకు ఎంపీడీవో తెలియజేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆందోళన సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, జింకల పర్వతాలు , మండల మహిళా అధ్యక్షురాలు మీస పార్వతి, వకుళాభరణం నర్సయ్యపంతులు సైతం అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.ఎమ్మెల్యే పల్లా గ్రామాల్లో పేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయిస్తే పత్రాలు ఇవ్వకుండా నిలిపివేసి పేదల పట్ల అధికార పార్టీ నేతలకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చే వరకు తాము మహిళలతో కలిసి ఆందోళన చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదని ఆందోళనలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్సై నవీన్ పోలీసులతో ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు.ఆందోళనలో అంకుగారి శ్రీధర్‌రెడ్డి, గదరాజు యాదగిరి, అరిగే కనకయ్య, ఆకుల రాజేశ్‌గౌడ్,ఎర్రోళ్ల యాదగిరి, బంగారిగళ్ల కిరణ్, శనిగరం లక్ష్మణ్, తాండ్ర సాగర్, అవుశర్ల కిశోర్, పాల బాలరాజు, శనిగరం రమేశ్, ముచ్చాల వంశీ, గర్నెపల్లి చంద్రం,మంతపురి సత్యనారాయణ, షేక్కమాల్ పాల్గొన్నారు.