దుబ్బాక, మే 16: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పది రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతోపాటు గ్రామంలో బోరుమోటర్లు మరమ్మతులు చేపట్టకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది.
నీటి సమస్యను పరిష్కరించాలని కార్యదర్శికి, సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో చేసేదేమిలేక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. సిద్దిపేట-రామాయంపేట జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటకుపైగా రాస్తారోకో చేపట్టడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎస్సై గంగరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మహిళలతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో ఎంపీడీవో భాస్కర శర్మ , మిషన్ భగీరథ అధికారులు గ్రామానికి చేరుకొని నీటి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ ధ్వంసం కావడంతో పాటు బోరు మోటర్లు పాడైపోవడంతో సమస్య తలెత్తిందని ఎంపీడీవో తెలిపారు. శుక్రవారం రాత్రి వరకు మిషన్ భగీరథ పైపులైన్, బోరు మోటర్లు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు.