దుబ్బాక, ఆగస్టు 30 : పుట్టినరోజు ఆ ఇల్లాలుకు చివరి రోజుగా మారింది. పుట్టిన రోజున అత్తగారింట్లో ఉదయం నుంచి సరదాగా ఉన్న ఆ మహిళ మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. వివరాలు.. దుబ్బాక మండలం గంభీర్‌పూర్‌కు చెందిన రెడ్డి సాగర్‌రెడ్డికి సిద్దిపేట మండలం లింగారెడ్డిపల్లికి చెందిన రవళి(25) అనే యువతితో ఐదేండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి రుత్విక్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డి ఇద్దరు కుమారులు సంతానం.
సాగర్‌రెడ్డికి వ్యవసాయం ఉన్నప్పటికీ సిద్దిపేటలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం అత్తగారింట్లో రవళి తన పుట్టినరోజును సంతోషంగా జరుపుకోవాలనుకుంది. సిద్దిపేటకు వెళ్తున్న భర్త సాగర్‌రెడ్డికి డ్యూటీ నుంచి తిరిగి వచ్చే సమయంలో కేక్ తీసుకురమ్మని చెప్పింది. రవళి పెద్ద కొడుకు రుత్విక్రెడ్డిని అంగన్వాడీ కేంద్రానికి పంపించి, అక్కడ అన్నం తినిపించి ఇంటికి వచ్చింది.
మధ్యాహ్నం తన అత్త ఉమను కిరాణా సామగ్రి, ఇతర వస్తువులను తీసుకురమ్మని దుబ్బాకకు పంపించింది. మామ మల్లారెడ్డి వ్యవసాయ పనులకు పొలం వద్దకు వెళ్లాడు. ఏడాదిన్నర వయసున్న చిన్న కొడుకు అక్షయ్రెడ్డితో కలిసి రవళి ఇంట్లోనే ఉంది. కొద్ది సమయానికి చిన్న కొడకు అక్షయ్‌రెడ్డి ఏడుస్తూ ఇంటి బయకు రావడంతో ఇంటి పక్కనున్నవారు వారి ఇంట్లోకి వచ్చి చూడగా…దూలానికి ఉరివేసుకుని రవళి మృతదేహం కనిపించింది.
రవళి ఆత్మహత్య చేసుకోవాల్సిన ఇబ్బందులు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఉదయం నుంచి సంతోషంగా ఉన్నా రవళి ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలకు తావిస్తున్నాయి. ఉదయం రవళి తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి పుట్టినరోజు సందర్భంగా తమ గ్రామానికి గంభీర్పూర్ రావాలిని కోరిందని తెలిపారు. సిద్దిపేట ఏసీపీ మధు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక సర్కారు దవాఖానకు తరలించినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.