కంగ్టి, ఫిబ్రవరి 20: భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కంగ్టి ఎస్సై విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తుర్కవడగామ గ్రామ నివాసి చంద్రమ్మ (45) కూలి పనిచేసి కాలం వెల్లదీస్తున్నది. బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప చిత్తుగా మద్యం సేవించి వచ్చి భార్య చంద్రమ్మతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య చంద్రమ్మను అతి కిరాతకంగా నరికి చంపాడు.
ఈ విషయం గురువారం తెల్లవారుజామున తెలిసిన వెంటనే ఇరుగుపొరుగువారు వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో, వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గుండప్పను అదుపులోకి తీసుకున్నారు. కొన్నేండ్లుగా వీరి మధ్య గొడవలు జరిగేవని గ్రామస్తులు చెబుతున్నారు. చంద్రమ్మ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు నారాయణఖేడ్ దవాఖానకు తరలించారు. గుండప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.