మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 23: అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారు. టిప్పర్లు, హిటాచీలు సీజ్ చేయాలి.. గరిబోళ్లు ఇల్లు కుట్టుకునేందుకు ట్రాక్టర్లో ఇసుక తేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తారు. రాత్రనక, పగలనక టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తే ఎందుకు అడ్డుకోవడం లేదంటూ అధికారులపై బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డిలు మండిపడ్డారు.
‘నమస్తే తెలంగాణ’లో గత మూడు రోజులుగా ప్రచురించిన ‘తోడేళ్లకే తోడ్పాటు’ అనే కథనానికి అధికారులు స్పందించక పోవడం, ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో మంగళవారం సంగాయిగూడ తండా శివారులో హలీవాగుకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ట్రైనీ కలెక్టర్ ఆహ్మద్, ఇతర రెవెన్యూ అధికారులు, పోలీసులతో కలిసి ముందుగానే వెళ్లి ఇసుక మాఫియాకు చెందిన వాహనాలు వాగులోకి వెళ్లడానికి వేసుకున్న దారికి అడ్డుగా మట్టి కుప్పలు అడ్డు వేశారు. ట్రిప్పర్లు, హిటాచీలు నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండలం కొంగోడ్ గ్రామ శివారులో దాచారని, అక్కడి గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులకు తెలుపడంతో అక్కడికి వెళ్లారు.
అక్కడ ఒక ప్రాంతంలో మూడు హిటాచీలు, హిటాచీలు తెచ్చేందుకు వాడే పెద్ద లారీ, మరో ప్రాంతంలో ఐదు ఇసుక లారీలు దర్శనమిచ్చాయి. కానీ, వాటి వద్ద ఎవరూ లేకపోవడం గమనార్హం. సంగాయిగూడ తండా శివారులోని హల్దీవాగును పరిశీలిస్తున్న తహసీల్దార్, ట్రైనీ కలెక్టర్, పోలీసుల వద్దకు వెళ్లి వారు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులతో ఎందుకు కుమ్మక్కయ్యారని నిలదీశారు. నెలన్నర నుంచి అక్రమంగా వందలాది వాహనాల్లో హైదరాబాద్, బీదర్ లాంటి ప్రాంతాలకు ఇసుక తరలిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారుల వద్ద నుంచి సరైన సమాధానం కరువైంది.
వాగులోకి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా మట్టి కుప్పలు పోశారని మాత్రమే సమాధానం చెప్పడం తప్ప మరో సమాధానం రాకపోవడం విశేషం. హిటాచీలు, ట్రిప్పర్లు సీజ్ చేసే వరకు ఇక్కడే బైఠాయిస్తామని వారు హెచ్చరించారు. దీంతో ఇసుక తరలించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, కొంగోడు వద్ద ఉన్న హిటాచీలు, వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం మెదక్ కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి ఇసుక అక్రమ తరలిపు, ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేశారు. వారి వెంట జడ్పీ మాజీ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మాచవరం సర్పంచ్ సాంబశివరావు, బీఆర్ఎస్ నాయకులు అంజాగౌడ్, కిష్టయ్య, ఆంజనేయులు, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జయరాజ్, ఆర్కె శ్రీనివాసన్స మోహన్ నాయక్ మార్గం అంజనేయులు, చంద్రకళ, రవి, ప్రభాకర్, వెంకటేశం, నవీన్, కిశోర్, బట్టి ఉదయ్, ఫాజిల్ తదితరులు ఉన్నారు.

ఇల్లు కట్టుకోవడానికి ఇసుక వద్దంటారు: తండా వాసులు
తాము ఇల్లు కట్టుకోవడానికి వాగులోని ఇసుకను ట్రాక్టర్ ద్వారా తెచ్చుకుంటామంటే అధికారులు తేనియ్యరు.. తెచ్చుకుంటే ట్రాక్టర్లను సీజ్ చేస్తారు. వేల రూపాయల ఫైన్ కట్టిస్తున్నారు. సుమారు రెండు నెలల నుంచి రాజకీయ నాయకుల అండదండలతో పెద్ద పెద్ద లారీలు, ట్రిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపన పోలేదని తండావాసులు ఆరోపించారు. తండా వద్ద లారీలను ఆపితే దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని తండా వాసులు అధికారులతో వాదనకు దిగారు. లారీలను ఆపినోళ్లను తొక్కేయండ్రా అని బెదిరిస్తున్నారని, ఏలంజాకొడుకులు లారీలు అపుతారో వారి అంతుచూస్తామని బెదిరించడంతో ఏమి చేయలేక ఊరుకుంటున్నామని తండావాసులు అధికారులతో మొరపెట్టుకున్నారు. రాత్రీపగలు భయంతో బతుకుతున్నామని వాపోయారు.
వేలాది మంది రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తాం
– పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు
ఇందిరమ్మ ఇండ్ల్లకు, గుడి, బడికి ఇసుక లేదు.. కానీ హైదరాబాద్‌కు, బీదర్‌కు రాత్రికి రాత్రికి ఆక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. రైతులు అక్రమ రవాణాను ఆపాలని ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. వ్యవసాయం చేయడానికి నీరు లేక మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.ఇసుక అక్రమ తరలింపు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. ఇసుక తరలిస్తున్న వారే, మళ్లీ వారే దొంగేదొంగ అన్నట్లుగా ఇసుక అక్రమ రవాణాను అరికడతామంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఇసుక ఇష్టారాజ్యంగా తీసుకెళ్తే వాగులో నీరు నిలిచే పరిస్థితి ఉండదని, దీంతో వ్యవసాయానికి నీరు లేక రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది, కాంగ్రెస్ నాయకులకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ఆమె ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాను ఆపే ప్రయత్నం చేస్తే చంపేస్తామని బెదిరించడం ఎంత వరకు సమంజసమన్నారు. కలెక్టర్, పోలీసులకు ఇది కనబడటం లేదా అని ఆమె ప్రశ్నించారు. మేము వస్తున్నామని తెలుసుకున్న అధికారులు, వాగులోకి వెళ్లే దారిలో అడ్డుకట్ట వేశారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే వేలాది మంది రైతులతో మెదక్ కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు.
అధికారులు పట్టించుకోక పోవడం దారుణం
-నర్సాపూర్ ఎమ్మెల్సే సునీతాలక్ష్మారెడ్డి
హల్దీవాగు నుంచి కొన్నిరోజులుగా ఇసుక అక్రమంగా తర లిస్తుంటే అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అక్కడి గ్రామస్తులు, తండా వాసులు అడ్డుకుంటే, అధికారులకు సమాచారమిచ్చినా స్పందించడం లేదన్నారు. చిన్న రైతు మట్టి తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తున్నారని, ఇసుక మాఫియా రోజూ లారీలు, ట్రిప్పర్లలో విచ్చలవిడిగా ఇసుక తరలిస్తే అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడి గ్రామస్తులకు సైతం ఇసుక మాఫియా నుంచి రక్షణ కల్పించాలని ఎమ్మెల్సే సునీతాలక్ష్మారెడ్డి కోరారు.
అక్రమ రవాణాపై దర్యాప్తు చేయాలి
-ఎమ్మెల్సీ యాదవరెడ్డి
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇసుక అక్రమ రవాణాపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిరోజూ ఇసుక మాఫియా స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే సహకారంతో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. లేకపోతే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో, హరీశ్‌రావు నాయకత్వంలో మెదక్ కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
అధికారుల అండదండలతోనే..
– మాజీ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి
ఇసుక అక్రమ రవాణా గురించి మూడు రోజులుగా పత్రికల్లో కథనాలు వచ్చినా ఇప్పటి వరకు అధికారులు స్పందించ లేదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మండిపడ్డారు. దీనిని బట్టి చూస్తే పోలీసు, నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాకు వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ స్పందిస్తేనే తప్పా అధికారులు స్పందించరా అని మండిపడ్డారు. వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు దూప్సింగాతండాలోని రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో ఇసుక మేట ఏర్పడితే, రైతు ఇసుక అక్కడి నుంచి తీసుకెళ్తే పోలీసులు పట్టుకెళ్లారని, ఇక్కడ ఇసుక అక్రమ రవాణాదారులను పట్టుకోకుండా మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు.