అందోల్, మే 24: రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తయితే, పంటను మార్కెట్లో అమ్ముకోవడం సవాల్‌గా మారుతున్నది. పండించిన పంటలను సరైన సమయానికి కొనుగోలు చేయక, ధాన్యం నిల్వచేసేందుకు సరైన స్థలాలు లేక రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెడుతున్నారుజ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారా..? అంటూ రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ కాల్లరిగేలా తిరుగుతున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దారిపొడవున ధాన్యం బస్తాలే దర్శనమిస్తున్నాయి. రైతులు యాసంగిలో ఎక్కువ మొత్తంలో వరిపంట సాగుచేశారు.
వడ్లను అమ్ముకుందామంటే పంట దిగుబడికి సరిపోను కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, ఉన్న కేంద్రాల్లో సరిగా కొనుగోళ్లు జరగక పోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ధాన్యం కుప్పల వద్దనే రాత్రీపగలు తేడాలేకుండా ఎండకు ఎండుతూ… వానకు తడుస్తూ రోడ్లపైనే భోజనాలు చేస్తూ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జోగిపేట-సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు మొత్తం ధాన్యంతో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రైతులు కాపాలా కాస్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి. కొన్నిసార్లు రైతులతో పాటు ఇటువైపు వెళ్లే వాహనదారులు సైతం ఈ ధాన్యం కుప్పల మూలంగా ప్రమాదాల బారిన పడుతున్నారు.
కానీ, అధికారులు మాత్రం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడం లేదు. ధాన్యం కాంటా పెట్టడం మొదలు, సంచులు రైస్‌మిల్లుల్లో కాళీ చేయడం వరకు తీవ్ర జాప్యం జరుగుతున్నదని రైతులు వాపోతున్నారు. గత సీజన్లలో కొన్ని రైస్‌మిల్లులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఈసారి వారికి ధాన్యం అధికారులు కేటాయించలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం కొన్ని మిల్లులకు మాత్రమే వెళ్తుండడం, ఆ మిల్లుల వద్ద భారీగా ధాన్యం నిల్వచేరడం, సరిపోను కూలీలు,హమాలీలు లేక సమయానికి ధాన్యం దించుకోవడం లేదు. దీంతో లారీల కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున త్వరగా కొనుగోళ్లు పూర్తిచేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
