సంగారెడ్డి, సెప్టెంబర్ 15: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు స్వాహా చేసిన కార్మికశాఖ అధికారులపై చర్యలు తీసుకొని శిక్షించాలని బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్‌కుమార్ డిమాండ్‌చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జిల్లా కమి టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన బోర్డు నిధులను అధికారులు అడ్డదారిలో కోట్లాది రూపాయలు కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
భవన నిర్మాణ కార్మికులు చెమటోడ్చి భవనాలు నిర్మిస్తే కాంట్రాక్టర్లు, ఓనర్లు ఒక శాతం సెస్ సంక్షేమ బోర్డుకు చెల్లిస్తే ఆ రూపాయలను కార్మికులకు వినియోగించాలి కానీ అడ్డదారిలో కాజేయడానికి కార్మికశాఖ అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల క్లెయిమ్స్‌ను ప్రభుత్వ అధికారులు పరిశీలించాలి కానీ రూ.వేల కోట్లను ప్రైవేట్ సంస్థకు ఇచ్చి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే జీవో నంబ ర్ 12ను రద్దుచేసి నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ సంస్థకు మంజూరు చేసిన రూ.346కోట్లను తిరిగి బోర్డులో జమచేయాలని డిమాండ్‌చేశారు. బోర్డు నిధులను పక్కదారి పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, భవన నిర్మాణ కార్మికులు నరేందర్, వెంకట్, సాయిలు, సుమన్, నర్సి ంహులు, గణపతి, శ్యామల పాల్గొన్నారు.