జహీరాబాద్/ సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 11: చెరుకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య భరోసా ఇచ్చారు. ‘చెరుకు రైతు నోరు.. తీపి అయ్యేనా’ అనే శీర్షికన ఈనెల 10న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం చెరుకు మద్దతు ధర రూ.3300 ప్రకటించడంతో జహీరాబాద్‌లోని పీవీఆర్ ఫంక్షన్హాల్లో మంగళవారం జహీరాబాద్ రైతులు సమావేశం కావాలని నిర్ణయించారు. కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణలోనూ మద్దతు ధర ప్రకటించాలని, తొందరపడి రైతులెవ్వరు క్రషింగ్‌కు తరలించవద్దని, ఏకతాటిపై ఒక్కటిగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు నిర్ణయానికి వచ్చిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితం కావడంతో కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు.
చెరుకు రైతులను మంగళవారం కలెక్టరేట్‌కు పిలిపించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చెరుకుకు మద్దతు ధర రూ.4,500 చెల్లించాలని, క్రషింగ్ తరలించిన చెరుకు బిల్లులు వెంటనే చెల్లించాలేలా చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చెరుకు రైతులకు బోనస్ చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలతో సమావేశమై వెంటనే చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు చెరుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
చెరుకు రైతుకు మద్దతు ధర అందించాలి: కలెక్టర్
చెరుకు రైతుకు మద్దతు ధర అందేలా కర్మాగార యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘా ల ప్రతినిధులు, జిల్లా అదనపు కలెక్టర్లతో కలిసి కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరుకు రైతులు, కంపెనీ నష్టపోకుండా రైతుకు గిట్టుబాటు ధర లభించేలా మద్ధతు ధర చెల్లించాలని స్పష్టం చేశారు. చక్కర ఫ్యాక్టరీల యాజమాన్యాలు తమ జోన్ పరిధి, నాన్ జోన్ పరిధి రైతుల పట్ల వ్యత్యాసం చూపకుండా అధిక ధరను ప్రకటించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆయా ఫ్యాక్టరీల ప్రతినిధులు కృష్ణమోహన్, యుగంధర్, వెంగల్రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, శివప్రసాద్‌రెడ్డి, చెరుకు రైతులు పాల్గొన్నారు.