మెదక్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్, నీటిపారుదులశాఖ ఇంజినీరింగ్ అధికారులు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారితో కలిసి పోచారం ప్రాజెక్టును పర్యాటక ప్రాంత అభివృద్ధి అవకాశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా పోచారం అభయారణ్యం ప్రాంతంలో 30 ఎకరాల స్థలంలో థీమ్ పారును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రెండు గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం, హోటల్స్‌తో పాటు బోటింగ్, చిల్డ్రన్ గేమ్స్, మరుగుదొడ్లు, లైటింగ్, పారింగ్ వంటివి ఏర్పాటు చేయడానికి కన్సల్టెంట్లతో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే వారంతా సెలవుల్లో జిల్లా ప్రజలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్ వాసులు ఉల్లాసం, ఆటవిడుపు కోసం నర్సాపూర్ అటవీ ప్రాంతంతో పాటు ఏడుపాయల, చర్చి, ఖిల్లా, పోచారం ప్రాంతాలను తిలకిస్తారన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సమీక్షలో జిల్లా పర్యాటక అధికారి శ్రీనివాస్, రా్రష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్ బాలచందర్, నీటిపారుదల శాఖ డీఈఈ రాజు తదితరులు పాల్గొన్నారు.