నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, డబ్బు ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లతో చేసి చూపించారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం పట్టణంలోని సాయి గార్డెన్స్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మెదక్ జిల్లా ఇన్చార్జి యెగ్గె మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, బస్ డిపో ఏర్పాటుతో దశాబ్దాల ప్రజల కల నెరవేరిందన్నారు. పట్టణంలో 122 ఎకరాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట నిర్మించనున్నట్లు తెలిపారు.
500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, పూర్తయిన వెంటనే అర్హులకు అందజేస్తామన్నారు. మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ, కంటివెలుగు తదితర పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో గ్రామాల్లో వలసలు తగ్గి, రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పునాదులని, బీజేపీ, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఝరాసంగంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. మూడో సారీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
– నర్సాపూర్/ జహీరాబాద్, ఏప్రిల్18
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మండలం రూ.40 కోట్లతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏండ్ల కల అయిన బస్సుడిపోను నిర్మించి ప్రస్తుతం బ్రహ్మాండంగా నడిపించుకుంటున్నామని తెలిపారు. నర్సాపూర్ మీదుగా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించడంతో జాతీయ రహదారి పక్కన గల భూములకు ధరలు పెరిగాయని, పట్టణంలోని 122 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తామని, అన్ని గవర్నమెంట్ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి నియోజకవర్గంలోని ప్రతి చెరువు, కుంటలను నింపుతామన్నారు. వచ్చే నెల నుంచి గృహలక్ష్మి పథకం కింద అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు అందజేస్తామని తెలిపారు.
ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి..
నర్సాపూర్, ఏప్రిల్ 18: దేశ ప్రజల తలరాత మార్చేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ సాయికృష్ణగార్డెన్లో నర్సాపూర్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బోగ చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు పంబళ్ల భిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి యెగ్గె మల్లేశం హాజరయ్యారు. నర్సాపూర్ పట్టణంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీతో సభాస్థలికి చేరుకున్నారు.
లక్షల మంది కార్యకర్తలున్న బీఆర్ఎస్ బలగానికి ఎలాంటి భయం ఉండకూడదని, బీఆర్ఎస్ను విమర్శించే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీకి కార్యకర్తలే పునాదులని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గ్రామాల్లోని ప్రజలకు వివరించాలని తెలిపారు. దేశంలోని రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ మాట్లాడి బీఆర్ఎస్ను స్థాపించాడన్నారు. తెలంగాణ మాదిరిగానే యావత్ దేశం కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వందసీట్లతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమోద్దీన్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ యువజన నాయకులు శశిధర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నగేశ్, హబీబ్‌ఖాన్, రావూఫ్, జ్ఞానేశ్వర్, ఆంజనేయులుగౌడ్, రాంచందర్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
14 చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో జలకళ
మంజీరా, హల్దీ వాగులపై 14చెక్‌డ్యామ్‌లు నిర్మించామని, ప్రస్తుతం అవి జలకళ సంతరించుకున్నాయన్నాయని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. చెక్‌డ్యామ్‌తో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ఇంత అభివృద్ధి జరిగేదా అని ఉద్ఘాటించారు. నర్సాపూర్ తాలూకాకు గోదావరి నీటిని తీసుకురావాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని గిరిజనతండాలకు రూ.55 కోట్లతో సీసీరోడ్లు, రూ.85 కోట్లతో బీటీరోడ్లు నిర్మించామన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో వలసలు పూర్తిగా తగ్గాయని, రైతుబంధు పథకంతో పట్టణాలకు వెళ్లిన గ్రామీణులు కూడా సొంత గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతితో గ్రామాలు, పట్టణాలు సుందరంగా తయారయ్యాయని, తెలంగాణకు జాతీయస్థాయిలో 13 అవార్డులు రావడం గర్వకారణమన్నారు. కులవృత్తులకు జీవం పోస్తూ గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు.