మునిపల్లి, ఫిబ్రవరి 20: మునిపల్లి మండలం అంతారం గ్రామంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాడి చేసినప్పుడు తండ్రిని కాపాడేందుకు అడ్డు వెళ్లి.. మృత్యువాత పడిన కూతురు ఆలియా బేగం కుటుంబాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం సందర్శించారు. అలియా బేగం మృతిపై ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా అలియా బేగం కుటుంబ సభ్యులతో ఎస్పీ మాట్లాడారు. ఈ నెల 11న ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగిందో ఇస్మాయిల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘర్షణ జరిగిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ.. ‘మీ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరు వచ్చినా ఈ నెల 11న ఏం జరిగిందో అది మాత్రమే చెప్పాండి’ అని ఇస్మాయిల్‌కు చెప్పారు. ‘మీ కుటుంబానికి ఎలాంటి సమస్య ఉన్న మా పోలీసుల దృష్టికి తీసుకురండి’ అని ఇస్మాయిల్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎస్పీ వెంట సంగారెడ్డి డీఎస్పీ సతయ్య గౌడ్, కొండాపూర్ సీఐ వెంకటేశం, మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తదితరులు ఉన్నారు.