కొండపాక(కుకునూరుపల్లి), ఏప్రిల్ 1: పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కొండపాక మండలంలోని విశ్వనాథ్‌పల్లి, రవీంద్రనగర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 418 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2203, బీ గ్రేడ్ధాన్యానికి రూ. 2180 మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా గన్నీబ్యాగులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి ప్రియదర్శిని, వెలుగు సమాఖ్య డీఎం హరీశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వాసవి లింగరావు, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
గజ్వేల్, ఏప్రిల్ 1: గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, మండలంలోని గిరిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, ఎంపీడీవో ప్రవీణ్, పీఏసీఎస్ సీఈవో బాలయ్య, మార్కెట్ కమిటీ సూపర్వైజర్ మహిపాల్ పాల్గొన్నారు.
మిరుదొడ్డి, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం కృష్ణారెడ్డి అన్నారు. అక్బర్పేట, ధర్మారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈవో నిర్మల, సీసీలు ప్రభాకర్, అక్బర్, ఆయా గ్రామాల వీవో లీడర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నారాయణరావుపేట, ఏప్రిల్ 1: కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. మండల పరిధిలోని బంజేరుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్, ఏపీఎం ధర్మసాగర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
బెజ్జంకి, ఏప్రిల్ 1: మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, డీపీఎం కరుణాకర్‌రెడ్డి, ఎంపీవో విష్ణు, ఎంపీవో నర్సయ్య, ఏఎంసీ కార్యదర్శి వెంకటయ్య పాల్గొన్నారు.
జగదేవ్‌పూర్, ఏప్రిల్ 1: మండలంలోని చాట్లపల్లిలో జిల్లావ్యవసాయాధికారి శివకుమార్, ఎంపీడీవో యాదగిరి స్థానిక నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సాగువుతున్న ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు కృష్ణమోహన్, ఎంపీవో శ్రీనివాసవర్మ, మండల వ్యవసాయాధికారి వసంతరావు, ఏపీవో ఆనంద్, ఆర్ఐ నాగరాజు పాల్గొన్నారు.
తొగుట, ఏప్రిల్ 1: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తున్నదని అడిషనల్ డీఆర్డీవో మధుసూదన్ అన్నారు. మండలంలోని రాంపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం ముగ్దంఅలీ,ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయాధికారి మోహన్, పీఆర్ఏ రామకృష్ణారెడ్డి, సంఘం అధ్యక్షురాలు మమత,స్వర్ణలత, సీసీ రజని, పంచాయతీ కార్యదర్శి అశ్విని పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్1: మద్దూ రు, ధూళిమిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో అధికారులుధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకొంటున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం కొనుగోలు కేంద్రాలకు గన్నీబ్యాగులను సరఫరా చేయలేదు. దీంతో గన్నీబ్యాగులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిస్తే ఏంలాభమని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.