రామాయంపేట, నవంబర్ 3: మళ్లీ వచ్చేది సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన డిప్యూటీ చైర్మన్ రూరల్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేండ్ల నుంచి ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలతో ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూరిందన్నారు. ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే మెజార్టీ ఉంటుందన్నారు. కచ్చితంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మిద్దామని చూస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక దొంగకు తాళం అప్పగించిందని, పార్టీలో సభ్యత్వంలేని అనామకులకు డబ్బులు, విల్లాలు తీసుకుని పీసీసీ అధ్యక్షుడు కోట్ల రూపాయలు దండుకుని టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు.
కనీస పరిజ్ఞానం లేని వారికి టికెట్లివ్వడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు. ప్రజల వద్ద ఓటు అనే వజ్రాయుధం ఉన్నదని, మూడోమారు కేసీఆర్ సీఎం కావడం పక్కా అన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం ఏ ఒక్కరికీ న్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రతిపక్ష పార్టీల హామీలను ప్రజలెవరు నమ్మరన్నారు. ప్రజలకు మేలు చేసే పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. సమావేశంలో రామాయంపేట ఎన్నికల ఇన్చార్జి శ్రీహరి యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు మానెగళ్ల రామకిష్టయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సుభాష్, మల్లేశం, ఇమానియేల్, సురేశ్, ఉమామహేశ్వర్, అల్లుడు జగన్, గోపాల కృష్ణ, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సార్గు సత్యనారాయణ, మండల యూత్ అధ్యక్షుడు కుమారస్వామి, వెంకట్‌రెడ్డి రామాయంపేట మత్స్యశాఖ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.