మర్కూక్, అగస్టు 8 : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగుకు నీరందిస్తారని వేచిచూస్తున్న రైతులకు కొండపోచమ్మ సాగర్‌లోకి నీటిని ఎత్తిపోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వర జలాలతో కొండపోచమ్మ సాగర్‌ను నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చి మల్లన్నసాగర్ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించింది. గురువారం ఒక మోటరు ను ఆన్ చేయడంతో గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి పరుగులు పెట్టాయి.
15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ సాగర్‌లో ఇప్పటికే 4.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఒక పంపు ద్వారా 1250 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఈనెల 11 వరకు నీటి లభ్యతను బట్టి గోదావరి జలాలు ఎత్తిపోస్తామని అధికారులు తెలిపారు. కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రామాయంపేట కాల్వకు 100 క్యూసెక్కులు, యాదాద్రి జిల్లా తుర్కపల్లి కాల్వకు, జగదేవ్‌పూర్ కాల్వకు 60 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.