చిన్నకోడూరు, మార్చి 16: కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చిన్నకోడూరుకు వచ్చిన గోదావరి జలాలను చూసి కాంగ్రెసోళ్లు కండ్లు తెరవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి బెల్లంకుంట చెరువుకు ఆదివారం నీటిని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగనాయకసాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి చిన్నకోడూర్ బెల్లంకుంట చెరువుకు కాళేశ్వరం నీళ్లు నింపాలనే విజ్ఞప్తితో తాను సొంత డబ్బులు వెచ్చించి పైప్‌లైన్ వేయించినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు.
రైతుల పంటలు ఎండకుండా ఉండాలనే ఉద్దేశంతో త్వరితగతిన పనులు పూర్తిచేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదన్న కాంగ్రెసోళ్లు ఇకడికి వచ్చి జలాలను చూడాలని హితవు పలికారు. బెల్లం కుంట చెరువుకు నీటిని విడుదల చేయడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, నాయకులు మాణిక్య రెడ్డి, శ్రీనివాస్, శ్రీహరి యాదవ్, కనకరాజు, పాపయ్య, జంగిటి శ్రీనివాస్, ఉమేశ్‌చంద్ర, ఇట్టబోయిన శ్రీనివాస్, ములుకల కుంటయ్య, సుంచు రమేశ్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.