నీటి వనరులు గలగలా పారుతున్నాయి.. ఎవుసం కళకళలాడుతున్నది… ఇదంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృషి ఫలితం! కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని నీటి కరువుతో కొట్టుమిట్టాడుతున్న మెతుకు సీమకు మళ్లీ బతుకునిచ్చినట్లయింది!! యాసంగి సీజన్లోనూ ఇక్కడి పంటభూముల్లో కాళేశ్వర గంగ గలగలనాదాలు వినిపిస్తున్నాయి. వందలాది చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఎక్కడో ఉన్న గోదారమ్మను రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల సహాయంతో సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి తీసుకురాగలుగుతున్నారంటే సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం! మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జవసత్వాలు వచ్చాయి.
కూడవెల్లి వాగుపై 39, హల్దీవాగుపై 32 చెక్డ్యాముల్లో కాళేశ్వర గంగ తొణికిసలాడుతున్నది. చెరువు, కుంటలన్నింటికీ నీటికళ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇటీవల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు రంగనాయక సాగర్ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. తర్వాత మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి కూడవెల్లి, హల్దీవాగులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గోదావరి నీటిని వదిలారు. ఫలితంగా వరుసగా మూడో ఏటా యాసంగి సీజన్‌కు సాగునీరు పారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ కావడంతో సాగునీటి రంగానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. గలగల పారేటి గోదావరి నీళ్లను బీడు భూములకు మళ్లించారు. నీటి పారుదల రంగానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడంతో ఇవ్వాళ ఆ ఫలాలు రైతాంగంకు అందుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో యాసంగి సాగుకు నీరును అందించడమే గాక వందలాది చెరువులు నింపుకుంటున్నాం. ఎక్కడో పుట్టిన గంగమ్మను రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్లతోపాటు సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి తీసుకువస్తున్నాం.
మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం పోసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం చేబర్తి వద్ద పుట్టిన కూడవెల్లి (కుడ్లేరు), వర్గల్ మండలంలోని తున్కిఖల్సా తపాల్ ఖాన్ చెరువు వద్ద పుట్టిన హల్దీ వాగు, ఇవి రెండు వాగులు ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ రెండు వాగులు జీవ నదులుగా మారాయి. కూడవెల్లి వాగుపై మొత్తం 39 చెక్‌డ్యాంలున్నాయి. దాదాపుగా అన్ని చెక్‌డ్యాంల వరకు నీళ్లు చేరాయి.
హల్దివాగుపై మొత్తం 32 చెక్డ్యాంలన్నాయి. ఇవి కూడా దాదాపుగా అన్ని గోదావరి జలాలతో నిండి ఉన్నా యి. కాగా కూడవెల్లి వాగుకు 0.32 టీఎంసీలు, హల్దీవాగుకు 0.1 టీఎంసీల నీటిని ఇప్పటివరకు విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖ ఎస్ఈ వేణు తెలిపారు. వరుసగా మూడో ఏటా సాగు నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లున్నాయి. రైతుల పంట పొలాలు ఎండిపోకుండా మండుటెండల్లో చెరువులను నింపుతున్నారు.
పంటలు ఎండిపోకముందే ప్రతి చెరువును కుంటను నింపాలనే ఉద్దేశంతో ఇటీవల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రంగనాయక సాగర్ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను విడుదల చేయగా, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి కూడవెల్లి, హల్దీవాగులకు గోదావరి జలాలను మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీలు వంటే రు యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి రైతులతో కలిసి విడుదల చేశారు. దీంతో రైతులు సంబుర పడుతున్నారు. గోదావరి జలాలు చెరువుల్లోకి పరుగులు పెడుతున్నాయి.
హల్దీవాగు నుంచి నిజాంసాగర్ వరకు..
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని తున్కిఖల్సా తపాస్ ఖాన్ చెరువు వద్ద పుట్టింది హల్ది వాగు. అక్కడి నుంచి ప్రారంభమైన వాగు నాచగిరి లక్ష్మీనర్సంహస్వామి దేవస్థానం నుంచి మెదక్ జిల్లాలోకి హల్దీ వాగు ప్రవహిస్తుంది. తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరాలో కలుస్తుంది. అక్కడి నుంచి నిజాంసాగర్‌లోకి వెళుతుంది. హల్దివాగు నుంచి నిజాంసాగర్ వరకు (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా) సుమారు 96 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేయడంతో ప్రస్తుతం మెదక్ జిల్లా తూప్రాన్ వరకు నీళ్లు చేరాయి.
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ (6.25 కి.మీ) ద్వారా హల్దివాగుకు నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి బంధం చెరువు, పెద్ద చెరువు, అంబర్‌పేట ఖాన్ చెరువులను నింపి హల్దీ వాగుకు అనుసంధానమైంది. సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దివాగు మధ్య 6 కి.మీ. ఉంటుంది. నాచగిరి లక్ష్మీనర్సంహస్వామి దేవస్థానం, తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరాలో కలుస్తుంది. హల్దీవాగు ప్రారం భం నుంచి మంజీరా వరకు 70 కి.మీ. ఉంటుంది. మెదక్ జిల్లాలోని మంజీరా నుంచి 20 కి.మీ దూరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఉంది. గత రెండు సంవత్సరాలు నీటిని విడుదల చేయడంతో అక్కడికి నీళ్లు చేరాయి. ప్రస్తుతం నీటిని విడుదల చేయడంతో చెక్‌డ్యాంలు నిండుతూ అక్కడి వరకు వెళ్లనున్నాయి.
కూడవెల్లి వాగులో గోదారమ్మ పరుగులు
గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలంలోని చేబర్తి పెద్ద చెరువు వద్ద కుడ్లేరు వాగు ప్రారంభమవుతుంది. ఈ వాగు పేరు కాలక్రమేణా కూడవెల్లి వాగుగా స్థిరీకృతమైంది. ఈ వాగుపై మొత్తం 39 చెక్‌డ్యాంలు నిర్మించారు. కూడవెల్లి వాగు గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, జగదేవ్‌పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు వరకు ప్రవహిస్తుంది. కాగా, ఈ వాగుపై నిర్మించిన అన్ని చెక్ డ్యాంలు దాదాపుగా నిండాయి. సిద్దిపేట జిల్లాలోని అన్ని చెక్‌డ్యాంలు నీటితో తొణికిసలాడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగు ద్వారా ఇప్పటి వరకు 0.32 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఎటుచూసినా గోదావరి జలాలు కనిపిస్తున్నాయి. వాగు పరీవాహక ప్రాంతం పచ్చని పైర్లతో కనువిందు చేస్తున్నది.
‘ఇప్పడు ఒక్కొక్క కాలువలో నీళ్లు పారుతున్నాయి. నీళ్లను చూసి ప్రజలు హర్షిస్తున్నారు. కూడవెల్లి, హల్దివాగుల్లోకి నీటిని వదిలినం. దుమ్ములేసి ఎండిపోయిన వాగుల్లో చెక్‌డ్యామ్‌లు కట్టి, నీళ్లు వదిలి వాటిని జలవనరుల్లాగా వాడుకుంటున్నాం. చెరువులు అలుగులు
పారుతున్నాయి’.
-రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
యాసంగి కాలంలో రైతులు ఏసిన వరి పంట చేండ్లు ఎండిపోకుండా సీఎం కేసీఆర్ సార్ మాకు కూడెల్లి ఆగులోకి గోదారి నీళ్లను అదిలి మా చేండ్లకు నీళ్లను ఇత్తుండు. కూడెల్లి ఆగులోకి గిప్పుడు ఎండల్లో నీళ్లు ఇయ్యకుంటే మా వరి పంటలు ఎండిపోయేటివి. మా ఎవుసాలు పండించతందుకు ఎన్కటికి మా పెద్దలు కూడా చానా కష్టాలు పడ్డరట. ఇప్పుడు ఆ రంది లేదు. పంటలు ఎండిపోకుండా కూడెల్లి ఆగులోకి నీళ్లను మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి వదులుతున్న సీఎం కేసీఆర్ సార్‌కు, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి రైతులందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నం.
– మద్దెల రాజయ్య, రైతు, మిరుదొడ్డి
కల్లుగీత పని వృత్తికి ప్రాణం పోశాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పుణ్యఫలంవల్ల మా మండలంలోని హల్దీవాగు పరీవాహక ప్రాంతం చుట్టూ కల్లుగీతపని చేసుకుంటూ బతుకుతున్న ఎనిమిది గ్రామాల గౌడ కులస్తులకు జీవనోపాధికి భరోసా కలిగింది. గోదావరి నీళ్లు రాకముందు వాగులో వానాకాలంలో బాగా వానలు పడితేనే నీళ్లుండేవి. ఎండాకాలం సుక్కనీళ్లుండేవికాదు. ఇప్పుడు వాగులో నీళ్లు, వాగుసుట్టూ పచ్చని ఈతచెట్లు పెరగడంతో కల్లు వ్యాపారానికి ఢోకా లేదు. వాగులో బోరు మోటార్లు దింపడం వల్ల, పంటలు ఎండిపోకుండా మేలు జరిగింది. చేపల వృత్తిదారులకు కూడా కలిసొచ్చింది.
-పోచారిగారి బాల్‌రాజ్‌గౌడ్, కల్లుగీత వృత్తిదారుడు (నెంటూర్, వర్గల్)
సాగునీటి కష్టం తీరింది…!
ఎండకాలంలో కూడవెల్లి వాగు పారుతుండటం కలలో కూడా ఉహించలేదు. ఇదొక అద్భుతం. సీఎం కేసీఆర్ చలువతోనే కూడవెల్లికి గోదారి నీళ్లు వచ్చాయి. యాసంగి పంటకు నీళ్ల కష్టం లేకుండాపోయింది. గత రెండు సంవత్సరాల నుంచి కూడవెల్లి వాగు నీటితో కళకళలాడుతుంది. మా రైతులకు సాగునీటి కష్టం తీర్చిన భగీరథుడు కేసీఆర్ సారు నిండునూరేళ్లు చల్లగా ఉండాలి. మల్లన్నసాగర్ నిర్మించకముందు కూడవెల్లి వాగు ఎండిపోవటంతో ఇసుక తేలి ఎడారిగా ఉండేది. ఇప్పుడు కూడవెల్లి వాగులో ఏడాదంతా నీళ్లుంటున్నయి. మా కష్టాలు తీర్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– కొత్తపల్లి వెంకటగౌడ్, రైతు (ఆకారం, దుబ్బాక)
పంటలకు జీవం పోసిన సీఎం కేసీఆర్
యాసంగిలో కూడవెల్లి వాగు వెంట పంటల సాగు చేసేవాళ్లం కాదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి నీటిని విడుదల చేయడంతో కూడవెల్లి వాగు జీవనదిగా మారింది. గతంలో వాగులో నీళ్లు ఉండకపోవడంతో వానాకాలం పంటలు కూడా ఎండిపోయేవి. గత మూడేళ్లుగా కూడవెల్లి పొడవునా పంట పొలాలకు జీవం వచ్చినట్లయింది. కూడవెల్లి వాగులోకి నీళ్లు రావడంతో పంట పొలాలతోపాటు పశుపక్ష్యాదులకు మేలు జరిగినట్లయింది. తెలంగాణ వస్తే ఏమొచ్చిందన్న సన్నాసులకు కూడవెల్లి వాగులోకి నీళ్లు వచ్చాయి.. అన్నదే సమాధానం.
-బెజ్జనమైన కనకరాజు, రైతు (వెంకట్రావుపేట, తొగుట)