హుస్నాబాద్ టౌన్, ఫిబ్రవరి 19: సిద్దిపేట జిల్ల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తీవ్ర నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను తలపించే ఈ ప్రాంతంలో పంటలు సాగుచేయడం రైతులకు కత్తిమీద సాములా మారింది. అప్పులు చేసి పంటలు వేస్తే చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేదు. జూదంలా సాగు మారిందని రైతులు ఆవేదన వ్యక్తంచ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గౌరవెళ్లి రిజర్వాయర్ పనులు 90శాతం మేరకు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో ట్రయల్న్ సైతం పూర్తిచేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది.
నీళ్ల కోసం ఎదురుచూపులు
దుర్భిక్ష పరిస్థితులకు నిలయమైన హుస్నాబాద్ ప్రాంత రైతులు గౌరవెళ్లి రిజర్వాయర్ నీటికోసం ఎదురుచూస్తున్నారు. తమ వ్యవసాయ భూములను తడిపేందుకు ఎప్పుడు నీళ్లు వస్తాయా అని ఆశపడుతున్నారు. నీటి సమస్యతో ఈ ప్రాంతంలో ఏటా పంటలు చేతికొచ్చే సమయంలో పోతుండటంతో పశువులకు మేతగా మారుతున్నాయి. దీంతో రైతులకు కష్టం బూడిద పాలవుతున్నది. అప్పులే మిగులుతున్నాయి. సిద్దిపేటలో జిల్లాలో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటుతున్నాయి. యాసంగిలో వేసిన వరిపొలాలు పొట్టకు వచ్చి ఈనుతున్న క్రమంలో నీటి సమస్యలతో ఎండిపోతున్నాయి. హుస్నాబాద్ శివారులోని పలువురు రైతులకు చెందిన పొలాలు సాగునీరందక ఎండిపోతున్నాయి. వేలాదిరూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వస్తుందన్న ఆశతో ఉన్న రైతులకు ఈ యాసంగి కలిసి రావడం లేదు.
పంట మొత్తం ఎండిపోతున్నది..
నాకు రెండున్నర ఎకరాల ఎవసాయ భూమి ఉంది. నీళ్లు ఎల్లుతయో లేదోనని రెండు ఎకరాల్లోనే వరివేసిన. దాదాపు నలభై వేలరూపాయల దాకా పెట్టుబడి అయ్యింది. పల్లెచెరువు కింద ఉన్న మా పొలాలకు ఎల్లమ్మచెరువు నీల్లే వత్తయి అని నాటేసినం. కాల్వకూడా తీసిండ్రు. అండ్ల నీళ్లు వత్తే పల్లెచెరువు కింద బాయిలల్ల నీళ్లు ఎల్లుతయి మాకు. ఆ ఆశతోనే ఈ బాయిల నీళ్లు ఉబ్బుతయి అని వరిపెట్టిన. లేకపోతే సేను వెయ్యికపోతును. పైపు బిండలు తెచ్చిన మడిమడికి నీళ్లు వేసిన అందుతలేదు. పదిహేను వేల రూపాయలు పెట్టి బావిల పూడిక తీసిన. కానీ, ఏం పాయిదలేదు. సేను కోసుకునే టైంల ఎండిపోయింది. సేను సెయ్యబట్టి అప్పుల పాలై పోయిన. అడిన్న ఈడిన్న అప్పులు తెచ్చి పంట పెట్టిన. ఏదిసేసినా నోట్లకు వచ్చినంక పోయింది. ఇరవై గుంటల భూమి ఇడిసిపెట్టిన చేతికి వత్తలేదు.
– గొర్ల కొమురయ్య, రైతు, హుస్నాబాద్
బాయిల పూడిక తీయిస్తున్న..
కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాల్లో వరి పంట పెట్టిన. ఎం డలు ముదరడంతో నీళ్ల్లు ఎల్తుతలేవు. ఎట్ల అని బాయిల పూడిక తీద్దమని సెప్పిన. నలభైవేల రూపాయలు అడిగిండ్రు. ఐదురోజుల నుంచి బాయిల పూడిక తీయిస్తున్న. మల్ల గంటసేపు నీళ్లు ఎల్తుతయని ఆశతోనే బాయిల పూడిక తీయిస్తున్న. ఇంక వారం రోజులు అయితట్టు ఉంది. మట్టి బాగా ఉందని సెప్పుతండ్రు. కానీ, నీళ్లు ఎల్లకపోతే వరి పొట్ట మీద ఉన్నది. గిప్పుడు నీళ్లు అందుతనే ఇంత నోట్లకు ఇన్ని గింజలు వచ్చేతట్టు ఉన్నయి.
– జక్కుల ఎల్లయ్య, రైతు, హుస్నాబాద్