ఝరాసంగం, ఏప్రిల్ 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిసరాలు కంపుకొడుతున్నాయి. ఆలయానికి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు, ప్రముఖులు దర్శనానికి వస్త్తుంటారు. ఈ క్షేత్రం పరిసరాల్లోని వాలాద్రి వాగు నుంచి వెలువడుతున్న దుర్వాసనతో భక్తులు ముక్కు మూసుకుంటున్నారు. ఆలయం ఎదుట శివపార్వతుల విగ్రహాల సమీపంలో చెత్తాచెదారం పేరుకుపోయింది.
దోమలు, ఈగలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. భక్తులు పది నిమిషాలు ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. ఊరి నుంచి ఆలయం వైపునకు వస్తున్న మురుగు వేరే వైపునకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి రెగ్యులర్ ఈవో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల శని అమావాస్య రోజు మంత్రి దామోదర రాజనరసింహా ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఆలయ పరిసరాలు అధ్వానంగా ఉండడంతో సిబ్బందిపై ఆ యన అసహనం వ్యక్తం చేశారు. అయినా ఆల య పరిసరాలను శుభ్రం చేయడం లేదు. కాగా, నేడు జరిగే కేతకీ ఆలయ పాలక మండలి ప్రమాణాస్వీకార కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహా, కొండా సురేఖ, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, ముఖ్యనాయకులు హాజరు కానున్నట్లు తెలిసింది. వారి రాకతో అయినా ఆలయ పరిసరాలు బాగుపడాలని భక్తులు ఆశపడుతున్నారు.