సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 6: ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన జూన్ వేతనంతో పాటు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై నుంచి నవంబర్ వరకు మొత్తం 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
ఇందులో మొత్తం 90 మంది అతిథి అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 34 మంది విధులు నిర్వహిస్తుండగా, పటాన్చెరు ప్రభుత్వ కళాశాలలో 19 మంది, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 మంది, జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10 మంది, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 మంది, సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు, సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇద్దరు అతిథి అధ్యాపకులు పని చేస్తున్నారు.
వీరంతా జూలై మొదటి వారంలో తిరిగి నియామకం అయ్యారు. అప్పటికే విధుల్లో పీజీ అధ్యాపకులకు జూన్ మాసానికి సంబంధించిన వేతనాలు ఇప్పటికీ విడుదల కాకపోవడం శోచనీయం. ఇంటర్మీడియట్ అతిథి అధ్యాపకులకు నెలకు రూ.42 వేలు, డిగ్రీ అతిథి అధ్యాపకులు నెలకు రూ.50వేల వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అతిథి అధ్యాపకులు మండిపడుతున్నారు.
ఇచ్చిన మాట మేరకు అతిథి అధ్యాపకులు రూ. 50వేల వేతనంతో పాటు కన్సాలిడేట్ వేతనాలను ఇవ్వాలని, రెగ్యులర్ అధ్యాపకులు వచ్చే వరకు తమ ఉద్యోగాలను భేషరతుగా రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని అతిథి అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. ఒక తాత్కాలిక ఉద్యోగి స్థానంలో మరొక తాత్కాలిక ఉద్యోగిని నియమించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తాత్కాలికులైన కాంట్రాక్ట్ అధ్యాపకులు బదిలీపై వచ్చినా అతిథి అధ్యాపకులను ఇంటికి పంపించడం సరికాదంటున్నారు. ఇప్పటికే ఏడాదికి కనీసం ఆరు నెలల పూర్తి వేతనం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా జీవితాలు బాగుపడతాయని ప్రజా పాలన ప్రభుత్వాన్ని నమ్ముకుంటే పస్తు లుండాల్సిన పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు అతిథి అధ్యాపకులకు రూ. 50వేల కన్సాలిడేటెడ్ వేతనాలు ఇస్తామ ని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆ ఉసేలేదు. వేతనాలను సకాలంలో అందించాలి.
– దేవేందర్, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో 8 ఏండ్లుగా వరుసగా సేవలందించాను. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశాను. ప్రస్తుత ఏడాది ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాను. సమయానికి వేతనాలు అందడం లేదు. ఉద్యోగం ఏటా రెన్యువల్ చేసి, కన్సాలిడేటేడ్ వేతనాలు ఇవ్వాలి.
– బి.నవీన్ కుమార్, కామర్స్ అతిథి అధ్యాపకుడు
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అతిథి అధ్యాపకుల వేతనాలను విడుదల చేయాలి. 6 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. జూన్ నుంచి నవంబర్ వరకు బడ్జెట్ను విడుదల చేసి అందుకు సంబంధించిన ఆథరైజేషన్ వెంటనే ఇవ్వాలి. వేతనాలు సకాలంలో రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.
– రమేశ్, కంప్యూటర్ అతిథి అధ్యాపకుడు
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేస్తున్నామనే సంతృప్తి తప్పా కుటుంబ పోషణ భారంగా మారింది. నెలనెలా వేతనాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. వెంటనే మా వేతనాలు విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన మాట ప్రకారం నెలకు రూ.50వేల వేతనాన్ని కన్సాలిడేటెడ్గా చెల్లించాలి. కనీస ఉద్యోగ భద్రత కల్పించి మా జీవితాలకు భరోసా కల్పించాలి.
– శ్రీనివాస్, కామర్స్, అతిథి అధ్యాపకుడు