హుస్నాబాద్, ఏప్రిల్ 18: హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన ఆధారమని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ మేధావులు, ఇంజినీర్లతో చర్చించిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లబరాజ్లు తెలంగాణ మొత్తానికి సాగునీరందిస్తాయన్నారు. వీటి విలువ రెండున్నరేండ్లు గడిస్తే తప్పా సీఎం రేవంత్‌రెడ్డికి అర్థం కాలేదన్నారు.
ప్రజలు, మేధావుల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి మేడిగడ్డను రిపేరు చేసేందుకు రేవంత్‌రెడ్డి పరుగులు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబా ద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దూరదృష్టితో నిధులు తెచ్చి అభివృద్ధి చేసి దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.
యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను ఎద్దేవా చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దానిపైనే ఆధారపడుతున్నదని తెలిపారు. 600కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేస్తున్న గోదావరిపై కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు కడితే పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నవి పెద్దవి కలిపి ఏడు ప్రాజెక్టులు కట్టిందన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 20న జగిత్యాలలో కేసీఆర్ సభ అంటేనే కాంగ్రెస్ వాళ్లు వణికిపోతున్నారని, ఇదే రోజు రేవంత్‌రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకోవడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. జగిత్యాల బహిరంగసభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అధికారం, డబ్బుతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన కాంగ్రెస్ నాయకులు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎదుర్కొని గెలవాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలిచి నీ సత్తా ఏమిటో నిరూపించుకో అని మంత్రి పొన్నంకు ఆయన చాలెంజ్ చేశారు. అనవసర విషయాల్లో వేలుపెడుతూ మంత్రి ప్రభాకర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. రెండున్నరేండ్లు గడిచినా ఒక్క పనికూడా పూర్తి చేయలేదన్నారు.
బీఆర్ఎస్ సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తేజస్వీసూర్య చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, సిద్దిపేట జిల్లా పరిషత్ మాజీ వైస్‌చైర్మన్ రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పేర్యాల రవీందర్రావు, ఏడు మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.