సిర్గాపూర్, అక్టోబర్ 4: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్‌లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోక పోవడంపై యూత్ ఫర్ ఖాజాపూర్ యువకులు కన్నెర్ర జేశారు. 15 రోజుల నుంచి గ్రామంలో తాగు నీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామంలోని 9 మంచి నీటి పథకం బోర్లు పనిచేయడం లేదు. మిషన్ భగీరథ సరఫరా లేక వారమైంది.
ఈ విషయంపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో శుక్రవారం ఖాజాపూర్‌లో ‘తాగునీటి కోసం తండ్లాట’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ హేమంత్‌కుమార్ శనివారం గ్రామానికి ఆర్ఐ మదన్, కార్యదర్శి వెంకటేశ్‌ను పంపారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వీరు రాగానే గ్రామస్తులు వారిని చుట్టుముట్టారు. కార్యదర్శి దురుసు ప్రవర్తన, నిర్లక్ష్యం వ్యవహారంపై మండిపడ్డారు. నీటి సమస్య తీర్చే వరకు కార్యదర్శిని ఇక్కడి నుంచి కదిలించేదే లేదని భీష్మించి పంచాయతీ ఆఫీస్ వద్ద యువకులు ధర్నా చేశారు.
మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ ఆఫీసు వద్ద ఆందోళన కొనసాగించారు. గ్రామంలో నీటి సమస్యతో పాటు పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, చెత్త సేకరణ ట్రాక్టర్ మూలకు చేరిందని, చెత్త నిండి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిర్గాపూర్ ఎస్సై మహేశ్ గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి శాంతింపజేశారు. గ్రామ యువకులు సమస్యలపై ఒక్కొక్కరు ఆవేదనతో ఎస్సైకి వివరించారు. అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎస్సై చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.