అన్నయ్య సలహా, సూచనలతో ఐదేండ్ల పాటు శ్రమించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన నరేశ్
పేదరికాన్ని జయించిన అన్నదమ్ములు
ఉపాధ్యాయ ఉద్యోగం పొంది, ఇతరులకు ఆదర్శంగా ..
గ్రామీణ పల్లెల్లో వ్యవసాయ రంగమే ప్రతి ఒక్కరికీ జీవనాధారం. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పండీ పండని పంటలతో, గీతకార్మికుడిగా కులవృత్తిని నమ్ముకొని జీవనం వెల్లదీస్తున్న పేద కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం.
మిరుదొడ్డి, జూన్ 20 : మిరుదొడ్డి టౌన్లో నేరండ్ల సరోజన రాజయ్యకు తాతతండ్రుల నుంచి వారసత్యంగా వచ్చిన మూడెకరాల భూమి ఉండేది. సరోజన వ్యవసాయ పనులతో పాటు బీడీలు చుడుతూ, భర్త రాజయ్యకు చేదోడు, వాదోడుగా నిలిచింది. రాజయ్య ఇటూ వ్యవసాయ పనులతో పాటు అటూ వారతస్వంగా వస్తున్న గీతా కార్మికుడిగా ఈత చెట్లను గీస్తూ కల్లును విక్రయించి, జీవనం సాగించారు. తాతతండ్రుల నాటి వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి తమ ముగ్గురు పిల్లలను చదివిపించి ఇద్దరు కుమారులను ఉపాధ్యాయలుగా తీర్చిదిద్దారు.
కుటుంబ నేపథ్యం..
నేరండ్ల సరోజన రాజయ్య దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు రమేశ్, నరేశ్, ఒక కూతురు రేఖ ఉన్నారు. పెద్ద కుమారుడు నేరండ్ల రమేశ్‌కు 2006వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడుగా ఉద్యోగం పొందాడు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 2012వ సంవత్పరంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 11వ ర్యాంకును సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొంది నేడు మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి జడ్పీ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో విద్యార్థులకు విద్యా భోధనలు చేస్తున్నాడు. 2018వ సంవత్పరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీఆర్టీ ప్రవేశ పరీక్షలను రాసి రెండో కుమారుడు నేరండ్ల నరేశ్ రాష్ట్ర స్థాయిలో 83వ ర్యాంకు సాధించగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ ర్యాంకును సాధించి, సిద్దిపేట జిల్లాలో మొదటి ర్యాంకు పొందించి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా తాను విద్యను అభ్యసించిన మిరుదొడ్డి టౌన్‌లోని జడ్పీ బాలుర పాఠశాలలో సాంఘీక శాస్త్రంలో విద్యార్థులకు విద్యా బోధనలు చేస్తున్నాడు.
ఉద్యోగం రాలేదని నిరుత్సాహ పడకుండా..
నేరండ్ల నరేశ్ ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు 1993-1998 సంవత్సరంలో గీతాంజలి విద్యాలయం (మిరుదొడ్డి), 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 1998-2003వ సంవత్సరంలో జడ్పీ పాఠశాల (మిరుదొడ్డి), ఇంటర్మిడీయట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2003-2005వ సంవత్సరం వరకు (మిరుదొడ్డి), డిగ్రీ 2005-2008వ సంవత్సరం వరకు విజయ సాయి డిగ్రీ కళాశాల (సిద్దిపేట), బీఈడీ 2009-2010వ సంవత్సర వరకు శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ (దుబ్బాక), ఎంఏ (ఇంగ్లీష్) 2010-2012వ సంవత్సరంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు)లలో విద్యను అభ్యసించాడు. 2012వ సంవత్పరం డీఎస్సీలో 7 మార్కుల తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని నరేశ్ పొందలేక పోయాడు. ఉద్యోగం రాలేదని నిరుత్సాహం పడకుండా నాన్నకు వ్యవసాయ రంగంలో తోడుగా పనులు చేస్తూనే పట్టుదలతో 5 ఏండ్ల కఠోరంగా శ్రమించి రాష్ట్ర ప్రభుత్వం 2017లో నిర్వహించిన టీఆర్టీ ప్రవేశ పరీక్షను రాశాడు. 2018వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఆర్టీ ఫలితాల్లో నేరండ్ల నరేశ్ రాష్ట్రంలోనే 83వ ర్యాకును పొందగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ ర్యాకును సొంతం చేసుకొని సిద్దిపేటలో జిల్లాలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. నేడు తాను విద్యను అభ్యసించిన మిరుదొడ్డి జడ్పీ బాలుర పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉపాధ్యాయ ఉద్యోగం పొంది సాంఘీక శాస్త్రంలో విద్యార్థులకు బోధనలు చేస్తూ, మన్ననలు పొందుతున్నాడు.
అమ్మ నాన్నల కష్టం వల్లనే నాకు ఉద్యోగం
మా అమ్మ నాన్నలు పడిన శ్రమ మూలంగానే నేను, మా అన్నయ్య రమేశ్ ఇద్దరం ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలను పొందాం. మా తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం రాకుండా ఇద్దరం అన్నదమ్ములము జీవితాంతం చూసుకుంటాం. మా లాంటి పేద విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం తెలంగాణ ప్రభుత్వ కృషి అభినందనీయం.
– నేరండ్ల నరేశ్, ఉపాధ్యాయుడు, జడ్పీ బాలుర పాఠశాల మిరుదొడ్డి