అధైర్యపడొద్దు.. అండగా నేనున్నానని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు భరోసానిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలో టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏ సమస్య వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలం ఉన్నామని, మీ సమస్యలను పరిష్కరించేందుకు కలిసి పోరాటం చేస్తామన్నారు. కార్యకర్తల పట్టుదల, బీఆర్ఎస్ కుటుంబంతోనే సంగారెడ్డి గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసి చింతా ప్రభాకర్‌ను గెలిపించామన్నారు. 2001 నుంచి 2014 వరకు ఉద్యమాల్లో ఉన్న బీఆర్ఎస్కు ఇదొక లెక్కకాదని, కార్యకర్తలు మనోనిబ్బరంతో ఉండాలన్నారు. పాలకపక్షం చేసే చిల్లర రాజకీయాలకు తలొగ్గకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని చావు నోటి దగ్గరికి వెళ్లివచ్చిన కేసీఆర్‌కు ఇలాంటివి కొత్తకావని హరీశ్‌రావు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ప్రశ్నించాలని కార్యకర్తలకు సూచించారు.
సంగారెడ్డి, డిసెంబరు 12: బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఒక్క ఫోన్ చేస్తే చాలు గంటలో మీ ముందుంటానని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసానిచ్చారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 12వ వార్డు జేఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గ కృతజ్ఞతా సభ టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అధ్యక్షతనలో నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా మాజీమంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. పోలింగ్ బూత్‌లలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన బూత్ కమిటీ కన్వీనర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో లేదని, పాలకపక్షం చేసే మోసాలకు గురికావొద్దని సూచించారు. కార్యకర్తలు ఆధైర్యపడకుండా ఉండాలని, అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఏ సమస్యలొచ్చినా ఉమ్మడి మెక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలం ఉన్నామని, మీ ఇబ్బందులు తీర్చేందుకు కలిసి పోరాటం చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్ కుంటుంబంతోనే సంగారెడ్డి గడ్డపై గులాబీ జెండా ఎగురవేసి చింతా ప్రభాకర్‌ను గెలిపించారని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని మనోధైర్యంతో పోరాడితే విజయం సాధిస్తామన్నారు. జిల్లాలోని పదిస్థానాల్లో ఏడింటిలో విజయం సాధించి మూడింటిలో ఓటమి చెందామని, నారాయణఖేడ్‌ను స్వల్పమెజార్టీతో కోల్పోయమన్నారు. అలాగే మెదక్, అందోల్‌లో ఓటమి చెందినా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటామన్నారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం బాగలేకున్నా గెలుపే లక్ష్యంగా పనిచేయడం సంతోషకరమన్నారు. 2001 నుంచి 2014 వరకు ఉద్యమాలతో రాటుదేలిన బీఆర్ఎస్కు ఇదొక్క లెక్కకాదని, కార్యకర్తలు మనోనిబ్బరంతో ఉండాలని కోరారు. పాలకపక్షం చేసే చిల్లర రాజకీయాలకు తలొగ్గకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని చావు నోటి దగ్గరికి వెళ్లివచ్చిన కేసీఆర్‌కు ఇలాంటివి కొత్తకావన్నారు. అభివృద్ధి చేసినం.. అయినా ప్రజలు మార్పు కోరుతూ కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ప్రశ్నించాలని కార్యకర్తలకు సూచించారు. కేవలం రెండుశాతం ఓట్లతో అధికారం కోల్పోయమని, వచ్చే ఐదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో సంగారెడ్డి, జహీరాబాద్ ఓడిపోతాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయని దేవీ ప్రసాద్ గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల్లో మాత్రం అందుకు విరుద్ధంగా విజయం సాధించామన్నారు. అధికారంలో లేమ ని బాధలో కార్యకర్తలు ఉన్నారని, ప్రజల తీర్పుకు కట్టుబడి బీఆర్ఎస్ నాయకులు నడుచుకుంటారన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని, ఏడుస్థానాల్లో గెలుపే నిదర్శనమన్నారు. ఐదేండ్లలో ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ప్రభు త్వం అందించే సంక్షమం, అభివృద్ధి సరిగ్గా అందకుంటే నిలదీస్తారన్నారు. రైతుబంధుకు పాత పద్ధతిలో నిధులు రైతుల ఖాతాల్లో జమచేస్తమని ప్రకటించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు నిలదీయాలని, పార్టీ అధినేత కేసీఆర్, హరీశ్‌రావుల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. కృతజ్ఞత సభలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, మండలాల ఎన్నికల ఇన్చార్జులు అంజన్నయాదవ్, మాధవరెడ్డి, తిరుపతిరెడ్డి, నాయకులు ముఖీమ్, శివరాజ్ పాటిల్, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, ఎంఏ హకీమ్, ఆత్మకూర్ నగేశ్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీమంత్రి హరీశ్‌రావు సలహాలు, కార్యకర్తల కృషితో సంగారెడ్డిలో గులాబీ జెండాఎగురవేశామని, ఈ విజయం హరీశ్‌రావుకు అంకితమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. తన ఆరోగ్యం బాగాలేకున్నా అన్నా నేనున్నా అంటూ నిరంతరం వెన్నంటే ఉంటూ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసి విజయతీరాలకు చేర్చారన్నారు. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అండగా ఉంటానని, తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు వేయాల్సి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిలో వేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చన హామీలను నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.
కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించామమని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సంగారెడ్డిని గెలిపిస్తేనే తనకు ముఖం చూసించాలని మాజీమంత్రి హరీశ్‌రావు అన్న మాటలను నిజం చేయడం సంతోషంగా ఉందన్నారు. 24 గంటల్లో 20 గంటలు పనిచేసే తత్వమున్న నాయకుడు హరీశ్రావని, గెలుపే లక్ష్యంగా పని చేయడంతో చింతా ప్రభాకర్ విజయం సాధించారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడం బాధాకరంగా ఉందని, సంగారెడ్డిలో అభ్యర్థి గెలుపులో ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించాలని కోరారు.