పటాన్చెరు,జూలై 2 : పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో సహాయక చర్యలు వేగవంతం చేయకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిగాచి పరిశ్రమలో జూన్ 30న ఉదయం రియాక్టర్ పేలి ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 163 మంది కార్మికులు ఉన్నారని తెలిసింది. జూలై 1న సీఎం రేవంత్ సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చారు. అప్పుడు అధికారులు ప్రమాదం జరిగిన సమయంలో 143 మంది కార్మికులు ఉన్నారని ప్రకటించారు. పరిశ్రమలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారు…ఎంతమంది ఆచూకీ లభించింది…చనిపోయిన వారు ఎంత మంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
బుధవారం అధికారుల లెక్కల ప్రకారం ఫ్యాక్టరీలో 143 మంది కార్మికులు ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నట్లు తేల్చారు. 38 మంది కార్మికులు చనిపోయారు…18 మంది కార్మికుల మృతదేహలను గుర్తించినట్లు ప్రకటించారు. పటాన్చెరు దవాఖానలో 18 మంది కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. 10 మంది మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. 34 మంది కార్మికులు పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 9 మంది కార్మికుల ఆచూ కీ లభించడం లేదన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికుల కుటుంబసభ్యుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలం వద్ద సహాయ చర్యలు వేగవంతం చేయడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం కార్మికుల ఆచూకీ తెలుపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో కార్మికులు శిథిలాల కింద ఉండిపోయారు.
శిథిలాలు లొలిగించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా, వర్షం కారణంగా మధ్యలో పనులకు అంతరాయం ఏర్పడుతున్నది. శిథిలాల కింద ఉన్న కార్మికుల మృతదేహాలను ప్రత్యేక బృందం బయటకు తీస్తున్నది. శిథిలాల కింద కార్మికుల మృతదేహాలు మాంసం ముద్దలాగా మారిపోయినట్లు సహాయ బృందం సభ్యులు తెలిపారు. కొందరి మృతదేహా శరీర భాగాలు విడిపోయి ఉన్నాయి.
గుర్తించేందుకు వీలులేకుండా మృతదేహాలు ఉండడంతో అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు కుటుంబసభ్యుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పుటికి 9 మంది కార్మికుల ఆచూకీ లభించక పోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
సిగాచి రసాయన పరిశ్రమలో తీవ్రగాయలైన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ధృవ దవాఖానలో క్షతగాత్రులను వారు పరామర్శించి అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కుటుంబాలకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని తెలిపారు. పరిశ్రమ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
సిగాచి పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిన నామిత్రుడు దీపక్ (28) ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించడం లేదు. దీం తో రెండు రోజులుగా పరిశ్రమ వద్దకు వస్తున్నాం. ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు. సర్కార్ పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీలో 3 నెలల నుంచి పని చేస్తున్నాడు. పాశమైలారం గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. ఒడిశాలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాం. దీపక్ ఆచూకీ తెలుపాలని అధికారులను కోరినా స్పందించడం లేదు.
-సోనమొద్దీన్(ఒడిశా)
మా తమ్ముడు దిలీప్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించడం లేదని ఫోన్ రావడంతో బీహారు నుంచి నలుగురం వచ్చాం. ఉదయం నుంచి ఫ్యాక్టరీ వద్ద ఉన్నా ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు. మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలువడం లేదు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారి వద్దకు పోయాం. అక్కడ లేడు. పోలీసులు మా నుంచి వివరాలు తీసుకున్నారు.
-శంకర్( బీహారు వాసి)
నా భర్త భీంరావు సిగాచి ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వెళ్లిన రెండు రోజులకే ప్ర మాదం జరిగి తీవ్ర గాయా లు కావడంతో పటాన్చెరు ధృవ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన మాట్లాడడం లేదు. సర్కారు మెరుగైన వైద్యం అందించి నాభర్తను కాపాడాలి. నాకు 6 నెలల పాప ఉంది. మేమే పటాన్‌చెరులోని బండ్లగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రమాదం సమాచారం తెలుసుకుని దవాఖానకు వచ్చాం.
-సోనీ, బాధిత కార్మికుడి భార్య నాదేండ్ (మహారాష్ట్ర)