పటాన్చెరు రూరల్, జూలై 9: సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పాశమైలారంలో ఐలా కార్యాలయంలోని హెల్ప్‌డెస్క్ వద్ద బాధిత కుటుంబాలను ఆదర్శ్‌రెడ్డి, సీనియర్ నాయకుడు గడీల శ్రీకాంత్‌గౌడ్, పాశమైలారం మాజీ సర్పంచ్ ఎం.కృష్ణయాదవ్‌తో కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు బాధిత కుటుంబాలతో ఆదర్శ్‌రెడ్డి మాట్లాడారు.
రూ. కోటి చొప్పున ప్రతి ఒక్కరికీ పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించగా, ఇప్పుడు పరిశ్రమ మాట తప్పి మిస్సింగ్ వ్యక్తుల కుటుంబాలకు రూ. 15లక్షలు ఇచ్చి తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధులు, అధికారులు, మంత్రు లు కలిసి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు, గల్లంతైన వ్యక్తుల కుటుంబాలకు తక్కువ నష్టపరిహారం ఇచ్చేలా కుట్రలు పన్నుతున్నదని చెప్పి మాజీ మంత్రి హరీశ్‌రావు తనను పం పించారన్నారు.
హరీశ్‌రావు అన్నట్టుగానే ఇక్క డ రూ. 15లక్షల చొప్పున చెక్కులు బాధితులకు ఇచ్చి పంపిస్తున్నారని మండిపడ్డారు. 44మంది మృతిచెందితే ఇలా బాధితులకు అన్యాయం చేయడం తగదని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. నష్టపరిహారం అందరికీ చెల్లించేవరకు హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. పరిశ్రమ యజమానులపై కేసులు ఎందుకు పెట్టడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పరిశ్రమ యజమానులను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ప్రమాద సమయంలో సీసీ కెమెరా ఫుటేజీలు ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నట్లు తెలిసిందన్నారు. పరిశ్రమ లో ప్రమాదం జరిగిన సమయంలో బయోమెట్రిక్ హాజరు పట్టిక, కాంట్రాక్టర్ అటెండెన్స్ రిజిస్టర్లు, విజిటర్స్ రిజిస్టర్లను బయట పెట్టాలని మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకలు చందు ముదిరాజ్, షకీల్, సల్మాన్, రవి పాల్గొన్నారు.