గజ్వేల్, మే 31: అధికార యంత్రాంగం ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 4న రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని శ్రీగిరిపల్లి, అక్కారం, రిమ్మనగూడ, కొడకండ్ల, బూరుగుపల్లి, అహ్మదీపూర్, పిడిచేడ్, దిలాల్పూర్, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు.
అధికారులు స్పందించని పక్షంలో వడ ట్రాక్టర్లతో రాజీవ్ రహదారిపై ధర్నా చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేక ధాన్యం సేకరణలో విఫలమైనట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు నేతృత్వంలో సమీక్షలు నిర్వహించి వేగంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసినట్లు గుర్తుచేశారు. జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రులు కనీసం సమీక్షలు కూడా నిర్వహించలేదని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై రైతుల నడ్డివిరుస్తున్నాయని విమర్శించారు. మెదక్ ఎంపీ రఘునందన్ మైకుల ముందు మాట్లాడేందుకు మాత్రమే సరిపోతారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు చెరుకు చంద్రమోహన్‌రెడ్డి, బొల్లారం ఎల్లయ్య రమేశ్‌గౌడ్, రాజిరెడ్డి, శివకుమార్, బాలచంద్రం, అశోక్, మురళి, దశరథ, బాల్‌రాజు, చెలిమేటి రాజు, రవీందర్‌రెడ్డి, నిజాం, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.