గజ్వేల్, ఏప్రిల్ 4:తెలంగాణలో కొనసాగుతున్నది ప్రజాపాలనా లేక కాంగ్రెస్ గూండాల పాలనా, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడే నిదర్శమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ పీఎస్‌కు చేరుకొని దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు వారికి అండగా ఉంటున్నామని, అలాంటి కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉంటారని, ఇక్కడికి వచ్చే వారి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. కేసీఆర్ కూడా తన సొంత నియోజకవర్గం ఎర్రవల్లిలోనే ఉన్న విషయం తెలుసుకోవాలన్నారు.
ఇలాంటి గూండాయిజానికి ఎవరూ భయపడరని ప్రజాస్వామ్య బద్ధంగా రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలంటే కలెక్టర్, గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. చట్టబద్ధంగా ముందుకు రావాలని, బరితెగింపు దాడులు చేస్తే కాంగ్రెస్ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న వారిపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే అసంపూర్తిగా ఉన్న రింగ్‌రోడ్డు, గ్రామాల్లోని ఫంక్షన్‌హాళ్లు, బస్టాండ్, మంజూరైన నిధులు రూ.185కోట్లు వెనక్కి తీసుకురాలని హితవు పలికారు. సర్పంచ్ ఎన్నికల్లో సిద్దిపేట జిలా వర్గల్, గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రజలు బుద్ధిచెప్పినా జ్ఞానం కలగడం లేదన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ కింద కాలువలు తీయాలని, సిగ్గుంటే రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టుకొని ఆ పనులు పూర్తి చేయాలన్నారు.
కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తులఉమా, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రైతుబంధు సమితి రాష్ట్ర మజీ కోఆర్డినేటర్ దేవీరవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, నవీజ్మీరా, నూనె కుమార్, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జుబెర్పాషా, కోట బాబు, మల్లేశం, జకియోద్ద్దీన్, రవీందర్, నర్సింగరావు, ప్రతాప్‌రెడ్డి, ఉమార్, స్వామిచారి, అహ్మద్ పాల్గొన్నారు.