గజ్వేల్, నవంబర్ 17: బీఆర్ఎస్ పార్టీతో పాటు కొందరు నేతలను టార్గెట్ చేసుకుని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేయడం బాధాకరమైన విషయమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అనేక హామీలు, ఆరుగ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించాలన్నారు. హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రజలకు గోదావరి జలాలు తీసుకొచ్చి, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీళ్లిచ్చి, తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేసి, దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తగదన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, ఎన్నికల కమిషన్, పోలీసులు ఒక్కటై బీఆర్ఎస్ను అక్రమంగా ఓడించాయని, ప్రజాస్వామ్యంపై దాడి చేశాయని, దీని గురించి కవిత మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి కవిత బీ-టీమ్‌గా మారి బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరికాదన్నారు. అనవసరంగా విమర్శించడం ఇకనైనా మానుకోవాలని కవితకు వంటేరు ప్రతాప్‌రెడ్డి హితవు పలికారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే జీపీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.